ఆమదాలవలస టౌన్, న్యూస్‌లైన్: మండల పరిధి తోటాడ, గోపీనగర్ వద్ద ఉన్న ఇసుక ర్యాంపులపై మంగళవారం రెవె న్యూ అధికారులు దాడులు చేశారు. శ్రీకాకుళం ఆర్డీవో గణేష్‌కుమార్, ఆమదాలవలస, ఎచ్చెర్ల తహశీల్దార్లు జి.వీర్రాజు, బి.వెంకటరావు దాడులు చేసి పది ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని నాగావళి నదిలో ఉన్న ర్యాంపును అధికారులు పరిశీలించారు. అధికారులను చూసిన ఇసుక అక్రమరవాణాదారులు ట్రాక్టర్లను జీడితోటల్లోకి తీసుకువెళ్లి విడిచిపెట్టి పారిపోయారు. జాతీయ రహదారి వంతెన కిందనే ఇసుక తవ్వకాలు జరగుతుండడంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తవ్వకాలు సాగితే భవిష్యత్‌లో వంతెనకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. పట్టుపడ్డ ట్రాక్టర్ల వివరాలు తీసుకొని వారిపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు.
ట్రాక్టర్లను ఆమదాలవలస ఎస్‌ఐ బి.మంగరాజుకు అప్పగించి పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలమేరకు ఈ దాడులు నిర్వహించామని, ఇసుక మాఫియా అక్రమాలను అడ్డకట్టువేసేందుకు అధికారులంతా కార్యచరణ చేస్తున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. ఈ దాడుల్లో సర్వేయర్లు బి.గోవిందరావు, రామగణపతి, ఆర్‌ఐ శ్రీనివాసరావు, వీఆర్వో కిరణ్, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
పట్టుకున్నారు, వదిలేస్తారుకదా?
ఇసుక మాఫియాను అరికట్టాలన్న ఉద్దేశంతో అధికారులు దాడులు చేసినప్పటి కీ అక్రమార్కులకు చీమకుట్టినట్లయినా లేదు. దాడులు జరిగినప్పుడు ఇసుకాసురులు, ట్రాక్టర్ల యజమానులు సమీపంలోని రోడ్లపైనే తిరుగుతుండడం విశేషం. అధికారులు పట్టుకున్న బళ్లను ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు అన్న ధీమా వారిలో కనిపిస్తోంది. ఇలా ఎన్నిసార్లు పట్టుకోలేదు, ఎన్నిసార్లు మేం తెచ్చుకోలేదని వారు వ్యాఖ్యానించడం ఆశ్యర్యం కలిగిస్తోంది.