ఎక్కడివక్కడ గప్‌చుప్!
ఇసుక ర్యాంపులను పరిశీలించిన కలెక్టర్
‘సాక్షి’ కథనాలకు స్పందన
అధికారుల రాకతో అప్రమత్తమైన ఇసుక ముఠా
తోటల్లోనూ, చెట్ల మాటున పొక్లెయినర్లు, ట్రాక్టర్ల దాచివేత
ఆమదాలవలస రూరల్: మండలంలోని దూసి గ్రామ సమీప నాగావళి నదిలో పొందూరు మండలం సింగూరు ఇసుక ర్యాంపు పేరుతో నడుస్తున్న ర్యాంపును కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రభుత్వ నిర్మాణాల ముసుగులో అక్రమంగా నడుస్తున్న ఇసుక ర్యాంపుపై ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఈ కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతాలకు వెళ్లి.. ర్యాంపులో ఇసుక నిల్వలు, వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. అప్పటి వరకు లోడింగ్ చేసే యంత్రాలు, ట్రాక్టర్లు కలెక్టర్ పరిశీలనకు వచ్చిన సమయంలో మాయమైపోయాయి.
ప్రభుత్వ అవసరాలకు కేటాయించిన ఇసుక నిల్వలు అక్రమ మార్గంలో తరలిపోతుందన్న విషయం పరిశీలనలో తేటతెల్లమైంది. ప్రభుత్వం ఇసుక విధానంపై కొత్త జీవో తీసుకురావడంతో పాటు ధరల ఖరారుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా ఇసుక ర్యాంపులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విధానంలో దూసి ఇసుక ర్యాంపు నిర్వహణ గురించి చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటారని మైన్స్ అధికారులు వెల్లడించారు. జిల్లా కమిటీల ఆదేశాల మేరకు దూసి ఇసుక ర్యాంపు మూసివేసి, కొత్తగా ర్యాంపులను ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు చెప్పారు.
మండలస్థాయిలో ధరల పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ర్యాంపు పరిశీలనలో మైన్స్ ఏడీ తమ్మినాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
తోటల్లో నక్కిన ఇసుక ముఠా..
ప్రతిరోజూ వందలాది లారీలకు ఇసుక తరలించే ముఠా.. అధికారుల రాకను గమనించి సమీప తోటల్లో దాక్కొంది. ఇసుకకు అనుమతులు ఉన్నాయని, వీటికోసం యంత్రాలు, ట్రాక్టర్లను ఉపయోగించుకోవచ్చునని బహిరంగంగానే చెప్పుకొనే ముఠా.. జిల్లా కలెక్టర్ పరిశీలనకు వస్తే యంత్రాలను దూసి గ్రామ ఎస్సీ కాలనీ సమీపంలో మామిడి తోటల్లో ఎందుకు దాచిపెట్టిందో తెలియడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, మైన్స్ అధికారులు ర్యాంపు పరిశీలనకు వస్తున్నారని మండల రెవెన్యూ అధికారులకే సమాచారం లేదు. ఇసుక ముఠాకు మాత్రం రెండు గంటల ముందే సమాచారం అందింది. దీంతో ఉదయం నుంచి ఇసుక లోడింగ్ చేసే మూడు పొక్లెయిన్‌లు, 20 ఇసుక ట్రాక్టర్లను సమీప తోటల్లో దాచిపెట్టారు. కలెక్టర్ రాకతోనైనా ఈ ఇసుక దోపిడీకి తెర పడుతుందని గ్రామస్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇసుకాసురుల భరతం పడతాం
సరుబుజ్జిలి: ఇసుకను అక్రమంగా తరలించినవారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి హెచ్చరించారు. ఆదివారం మండలంలోని పురుషోత్తపురం గ్రామంలో గతంలో ర్యాంపు నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించారు. గృహనిర్మాణాలు, ప్రభుత్వ పనులకు మినహా ఇసుకను అడ్డదారుల్లో తరలిస్తే క్రిమినల్ కేసులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇసుక అక్రమార్కులపై గట్టి నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. యరగాం ఇసుక ర్యాంపు లక్ష్యం పూర్తయినందున, పురుషోత్తపురంలో అధికారిక ర్యాంపు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఆయనతోపాటు తహసీల్దార్ జేమ్స్ ప్రభాకర్, సర్వేయర్ సూర్యనారాయణ, ఆర్‌ఐలు గాయత్రి, కృష్ణకుమారి, వీఆర్వో జోగినాయుడు తదితరులున్నారు.