స్థానిక చట్టాల మేరకు పార్టీ కార్యాలయాల్లో హోర్డింగ్‌లకు అనుమతి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో హోర్డింగులను కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను కొనసాగించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం ఆయన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖేష్కుమార్ మీనా మాట్లాడుతూ మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం సందర్భంగా పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులను తొలగించడంతోపాటు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చాయని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాల్లో 4గీ8 అడుగుల బ్యానర్, ఒక జెండాను అనుమతించాలని అధికారులకు చెప్పారు. రాజకీయ పార్టీల కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, అయితే ఇందుకు 48 గంటల ముందుగా సువిధా పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. అత్యవసర పరిస్థితిల్లో రాజకీయ పార్టీల నుంచి ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తులను స్వీకరించి, ఆ వివరాలను ఎన్కోర్ పోర్టల్లో నమోదుచేసి సకాలంలో తగిన అనుమతులను జారీచేయాలని సూచించారు.
ఇంటింటి ప్రచారంపై త్వరలో నిర్ణయం
ముందుగా అనుమతి పొందిన తర్వాతే అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి వెళ్లాలనే నిబంధన సరికాదని, దానిని పునఃసమీక్షించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నిబంధన అమలు విషయంలో భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలతోపాటు ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం, స్థానిక సంస్థల చట్టం, జీవీఎంసీ చట్టాలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు.
నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతోపాటు కార్యాలయాల్లో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని స్పష్టంచేశారు. ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల పక్కన ఉన్న హోర్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలని, నూతన హోర్డింగులకు అనుమతి ఇవ్వొద్దని చెప్పారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్లకు అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలన్నారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎంఎన్ హరీంధరప్రసాద్, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment