దేవుడి పేరుతో ఓట్ల వేట
బీజేపీ, కాంగ్రెస్.. పార్టీ ఏదైనా ఓట్ల వేట సాగించేది మాత్రం దేవుడి పేరుతోనే. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఫైజాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, ఆయన ప్రసంగించిన సభా వేదికపై వెనకాల భారీ ఎత్తున రాముడి ఫొటోలు, అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామమందిరం ఫొటోలు ఉన్నాయి. రామమందిరం గురించి ఆ సభలో మోడీ నేరుగా ప్రస్తావించకపోయినా.. రాముడిని మాత్రం ప్రస్తావిస్తూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలను ఓడించాలని ఓటర్లను కోరారు. దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే ఆ జిల్లా అధికారులను నివేదిక కోరింది.
సభలో ఆయనేం మాట్లాడారు, సభా వేదికపై ఎలాంటి ఫొటోలున్నాయని జిల్లా కలెక్టర్‌ను అడిగినట్లు యూపీ ఎన్నికల ప్రధాన అధికారి ఉమేష్ సిన్హా తెలిపారు. మరోవైపు వారణాసిలో నరేంద్ర మోడీపై పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఏకంగా కాశీ విశ్వనాథుని ఆలయం ఫొటోను తన నేపథ్యంలో పెట్టుకుని భారీ కటౌట్లు వారణాసి నగరంలో ఏర్పాటుచేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వివాదాన్ని సృష్టిస్తున్నాయి.