ఓటే యువతకు ఆయుధం
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : సమాజాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి యువతకు ఓటే ఆయుధమని డీఎస్పీ లతామాధురి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్‌లో పట్టణ యువజన సంఘాల సమితి, టీజీఏ ఆధ్వర్యంలో సోమవారం ఆన్లైన్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలోని అవినీతి, అక్రమాల నిర్మూలనకు యువత ఓటు అనే ఆయుధంతో ఉత్తమ నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. తద్వారా ఓటుహక్కును సద్వినియోగం చేసుకుని దేశ, సమాజ ఉన్నతికి పాటుపడాలన్నారు.
ఓటరు నమోదు కోసం యువజన సంఘాల నాయకులు చేపట్టిన ఉచిత ఆన్లైన్ ఓటరు నమోదు కార్యక్రమం అభినందనీయమని ప్రశంసించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని, కోరారు. అనంతరం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 2,500 మంది ఓటరుగా పేరు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు, పట్టణ యువజన సంఘాల సమితి అధ్యక్షుడు ఊరే గణేశ్, టీజీఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రంగినేని శ్రీనివాస్, యువజన సంఘాల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలశంకర్‌కృష్ణ, యువజన సంఘాల పట్టణ ఉపాధ్యక్షుడు గోలి శంకర్, నాయకులు బండారి సతీశ్, వినోద్, కిశోర్, సాయి, విష్ణు పాల్గొన్నారు.