ఓటర్ల నమోదు గడువు పొడిగింపు
23 వరకు పొడిగిస్తున్నట్లు
సీఈవో భన్వర్‌లాల్ వెల్లడి
ఆదివారం కూడా దరఖాస్తులు స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల నమోదు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారంతో ఓటర్ల నమోదుకు గడువు ముగిసింది. అయితే చాలామంది ఇంకా ఓటర్లగా నమోదు కావాల్సి ఉన్నందున వారికి అవకాశం ఇవ్వడానికి గడువును పొడిగించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ కల్లా 18 ఏళ్లు నిండిన వాళ్లు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. 22వ తేదీ ఆదివారం కూడా రాష్ట్రంలోని 69 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌స్థాయి ఆఫీసర్లు ఓటర్ల జాబితాలతో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆయా పరిధిలోని పౌరులు ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
23 వరకు ఓటర్‌గా నమోదుకు స్థానిక మండల, ఆర్డీవో కార్యాలయాల్లోను, మున్సిపల్ కార్పొరేషన్లలో సర్కిల్ల్లోను, జీహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిల్లోని డిప్యూటీ మున్సిపల్ కార్యాలయాల్లోను దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 16న ప్రకటించనున్నట్లు తెలిపారు.