ఓటు హక్కు మింగే ముందు కనీసం చెప్పండి
ఓటరు జాబితా నుంచి ఓటరు పేరును తొలగించే ముందు ఓటరుకు కారణాలను తప్పక తెలియజేయాలి. తొలగించే ముందు నోటీసు ఇవ్వడమే కాకుండా, అంతకు ముందు తన ఓటును రక్షించుకోవడానికి తన వాదం వినిపించే అవకాశాన్ని పూర్తిగా ఇవ్వాలి.
ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలోంచి ఓటర్ల పేర్లు తొలగించారని గగ్గోలు పెట్టడం వింటూ ఉంటాం. ఒక ఓటరు తన ఓటు హక్కు ను హరించారంటూ ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎం దుకు తొలగించారో తెలియజే యాలని కోరాడు. ఆ యువ కుడి పేరు సుమిత్. 21 సంవత్సరాల వయసు దాటింది. ఓటరుగా నమోదు చేసుకున్నాడు. ఓటర్ల జాబితాలోకి అతని పేరు ఎక్కింది కూడా. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటు వేశాడు. కాని 2015లో మళ్లీ జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో ఓటర్ల జాబితాలో లేకపోవడంవల్ల తను ఓటు వేయలేకపోయాడు.
తన ఓటరు చిరునామా మారలే దని, అదే ఇంట్లో ఉంటున్నానని, కాని తనకు తెలపకుం డా తన పేరును జాబితా నుంచి తొలగించడం వల్ల తాను ఓటు వేయలేకపోయాయని అతను వాదించాడు. తన పేరు తీసేసే ముందు తనకు తెలియజేయలేదని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినా జవాబు ఇవ్వలేదని, మొ దటి అప్పీలులో కూడా జవాబు లేకపోవడం వల్ల కమి షన్ ముందుకు వచ్చానని వివరించాడు. మన రాజ్యాంగం 15వ భాగంలో ఎన్నికల వ్యవహా రం గురించి నియమాలున్నాయి. ఆర్టికల్ 325 ప్రకారం మతం, జాతి, కులం, ఆడామగ తేడా పైన ఓటర్ల జాబి తాలో చేర్చడంలో అనర్హత విధించడానికి వీల్లేదు.
వయో జన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలు జరపాలని ఆర్టి కల్ 326 నిర్దేశిస్తున్నది. ఆర్టికల్ 19(1)(ఎ) కింద అభి ప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందికి కూడా ఓటు హక్కు వస్త్తుంది. అంతర్జాతీయ ఒప్పందాలతోపాటు, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 62 ప్రకారం ఓటర్ల జాబి తాలో పేరున్న ఓటర్లందరూ ఓటు వేయడానికి అర్హులని నిర్దేశిస్తున్నది. ఓటరు అన్న నిర్వచనం కూడా జాబితాలో పేరున్న వారు అని ఉంది. సెక్షన్ 16లో అనర్హతలు వివ రించారు.
ఓటు హక్కు రాజ్యాంగపరంగా పౌరుడికి ప్రసాదించిన కీలకమైన హక్కు అనీ, అయితే చట్టంలో ఈ హక్కును మరింత బలోపేతం చేశారనీ, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఇది చాలా మౌలికమైన ఆధారమని సుప్రీంకోర్టు 2013లో పి.యు.సి.ఎల్ వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టం చేసింది. నోటీసు పంపిన తరువాత కూడా చీఫ్ ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఎవరూ రాకపోవడం వల్ల వారి వాదం ఏమిటో ఎందుకు జవాబు ఇవ్వలేకపో యారో కమిషన్కు తెలిసే అవకాశం లేకుండా పోయిం ది. అభ్యర్థి అప్పీలుదారు వాదం ఒక్కటే కమిషన్ ముం దుకు వచ్చింది. చీఫ్ ఎన్నికల అధికారి కార్యాలయానికి రెండు బాధ్యతలు ఉన్నాయి.
ఒకటి ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఓటరు జాబితా నుంచి ఓటరు పేరును తొల గించే ముందు ఓటరుకు కారణాలను తెలియజేయవల సిన బాధ్యత ఉంది. ఈ విషయాన్ని సెక్షన్ 22 ప్రజా ప్రాతినిధ్య చట్టం, రూల్ 21ఏ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలెక్టర్స్ రూల్స్ 1960 కింద చాలా స్పష్టంగా నిర్దేశించారు. తొల గించే ముందు నోటీసు ఇవ్వడమే కాకుండా, అంతకు ముందు తన ఓటును రక్షించుకోవడానికి తన వాదం వినిపించే అవకాశాన్ని పూర్తిగా ఇవ్వాలి. ఆ తరవాత కారణాలు వివరిస్తూ ఓటరు పేరును తొలగిస్తున్న సమా చారం నోటిఫై చేయవలసి ఉంటుంది.
మీరే ఓటరు జాబితా చూడండి, మీ పేరు లేకపోతే ఫిర్యాదు చేయం డి, ఫలానా ఫారం నింపండి అని పత్రికలలో, టీవీలలో ప్రచారం చేసాం కనుక నోటీసు ఇచ్చినట్టే అని వాదించ డానికి వీల్లేదు. ఓటరుగా నమోదు కావడానికి ఈ వాదం పనికి వస్తుంది. కాని ఓటరుగా ఒకసారి లిస్ట్టులో చేరిన తరువాత, ఆ పేరును తొలగించడం అంటే హక్కును తొలగించడమే అవుతుంది కనుక తప్పనిసరిగా వ్యక్తి గతంగా నోటీసు ఇచ్చి తీరాలని, తరవాత వాదించే అవ కాశం ఇవ్వవలసి ఉంటుందని ప్రజాప్రాతినిధ్య చట్టం వివరిస్తున్నది. శ్రీమతి దార్ల రమాదేవి వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేసును 2009లో విన్న న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డి ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పులో ఈ విషయాలు వివరించారు.
ఓటర్లు కనబడకపోవడం వల్ల తాము ప్రత్యామ్నాయంగా నోటీసులు ఇచ్చామని కనుక నోటీసు ఇచ్చినట్టే అని చేసిన వాదనను న్యాయమూర్తి అంగీకరించలేదు. కొన్ని వందల పేర్లు తొలగించారని, తాము పేర్కొన్న అడ్రసు గల ఇండ్లలో నివసించడం లేదనీ ఆరోపించారని పిటిషనర్లు కోర్ట్టుకు తెలిపారు. నిజానికి తాము ఊళ్లోనే ఉన్నామని వారు వాదించారు. తగిన నోటీసులు ఇవ్వలేదన్న కారణంగా ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల తొలగింపు చెల్లదని నరసింహారెడ్డి తీర్పు చెప్పారు. ఈ అంశంపైన ఇదే గణనీయమైన తీర్పు.
సమాచార హక్కు కింద అడిగినపుడు ప్రతిస్పం దించడం మరో బాధ్యత. సెక్షన్ 4(1)(సి) కింద తమ చర్యలవల్ల నష్టపోతున్న వారికి, ఏవైనా హక్కులు కోల్పో తున్న వారికి ఎందుకు ఆ విధంగా చర్యలు తీసుకు న్నారో తెలియజేయవలసిన బాధ్యత ఉందని తమంత తామే ఈ కారణాలు వెల్లడించాలని సమాచార హక్కు చట్టం వివరిస్తున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎందుకు కారణాలు వివరించలేదు, ఎందుకు నోటీసు ఇవ్వలేదు, తమ వాదా న్ని వినిపించుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేదు. సమా చార హక్కు చట్టం కింద అడిగినా ఎందుకు ప్రతి స్పం దించలేదో వివరించాలని, ఎందుకు జరిమానా విధిం చకూడదో కారణాలు తెలపాలని కమిషన్ నోటీసు జారీ చేసింది.
- మాడభూషి శ్రీధర్
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com