ఓటర్లపై కాంగ్రెస్ వర్గీయుల దాడి.
కారేపల్లి, న్యూస్‌లైన్: తమకు ఓట్లు పడవనే భయమో.. ఏమో.. గోటితో పోయేదాన్ని, గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లు, ఓ చిన్న వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. ఓటర్ల పై పిడిగుద్దులతో పాటు మహిళలని కూడా చూడకుండా ఇష్టానుసారంగా దాడులకు పాల్పడి తీవ్రంగా గాయపరిచారు కాంగ్రెస్ కార్యకర్తలు. పోలీసుల సమక్షంలోనే ఈ చర్యలకు పాల్పడటం గమనార్హం.
మూకుమ్మడిగా దాడి చేసి పలువురిని గాయపరిచిన ఈ ఘటన కారేపల్లి మండలం మాధారం పోలింగ్ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం...మాధారం-1 ఎంపీటీసీ స్థానానికి ఓటు వేసేందుకు, స్థాని క బుడిగ జంగాల కాలనీకి చెందిన సుమారు 60 మంది క్యూలో నిల్చున్నారు.
కొత్తతండా గ్రామానికి చెందిన మరో 80 మంది సైతం క్యూలో ఉన్నారు. కాగా కొత్తతండాకు చెందిన ఓ మహిళ క్యూ పాటించకుండా ముందు వరుసకు వెళ్తుండగా, బుడిగ జంగాల కాలనీకి చెందిన పస్తం విజయ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఎదురు దాడి కి దిగిన సదరు మహిళ విజయపై చేయి చేసుకుంది.
కాలనీ వాసులు జోక్యం చేసుకోవడంతో అక్కడే ఉన్న కొత్తతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు దిగారు. మహిళలు అని కూడా చూడకుండా.. విజయతో పాటు పస్తం ప్రమీల, వృద్ధురాలైన పస్తం రామలక్ష్మమ్మ, నిదానపు సతీష్, తుర్పాటి సారయ్య, తుర్పాటి శంకర్లను తీవ్రంగా గాయపరిచారు. అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు తేరుకునేలోపే పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఆ తర్వాత పోలీసులు లాఠీచార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
దాడిలో పస్తం ప్రమీల, రామలక్ష్మమ్మ స్పృహ కోల్పోగా, పస్తం విజయ చేతికి గాయమైంది. వీరితో పాటు తీవ్రంగా గాయపడిన నిదానపు సతీష్, తుర్పాటి సారయ్య, తుర్పాటి శంకర్లను 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఇల్లందు ట్రైనీ డీఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ఓటు వేయమని తెలిసే దాడి చేశారు...
తాము కాంగ్రెస్‌కు అనుకూలంగా లేరనే అక్కసుతోనే మాధారం సర్పంచ్ మంగీలాల్ తన అనుచరులను ఉసుగొల్పి దాడి చేయించారని కాలనీ వాసులు ఆరోపించారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, కూలి చేసుకుని జీవించే తమపై కక్ష సాధించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, టీడీపీకి చెందిన కొందరు బుడిగ జంగం కాలనీవాసులు తమ పార్టీ వారేనని, కాంగ్రెస్ కార్యకర్తలు తమ పార్టీపై దాడి చేశారని చెప్పి సానుభూతి పొందేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
సర్పంచ్‌తో పాటు 12 మందిపై కేసు నమోదు
ఈ ఘటనలో మాధారం సర్పంచ్ మంగీలాల్‌తో పాటు, మరో 11 మంది నాగండ్ల సీతయ్య, తన్నీరు వీరయ్య, కిలారు అప్పారావు, ధారావత్ వినోద్, అజ్మీ ర సురేష్, ధారావత్ సంతు, ధారావత్ హరి, ధారావత్ వీరు, ధారావత్ రమేష్, రాందాస్, బాధావత్ చిన్నాల పై కేసు నమోదు చేశామని అన్నారు.