73.67 శాతం ఓటింగ్!
ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన
ధర్మపురి అత్యధికం - చెన్నై అత్యల్పం
పోలింగ్‌లో మహిళా ప్రభంజనం
రాష్ర్టంలో 73.67 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం శనివారం అధికారికంగా ప్రకటించింది. ధర్మపురిలో అత్యధికంగా 81.07 శాతం, అత్యల్పంగా దక్షిణ చెన్నైలో 60.40 శాతం పోలింగ్ నమోదైంది. పురుషుల కన్నా, మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరులు ఉత్సాహంగా ఓటింగ్‌కు హాజరయ్యారు.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని 39 లోక్ సభ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఆయా లోక్ సభ నియోజకవర్గాల నుంచి ఓటింగ్ శాతం రాష్ట్ర ఎన్నికల యంత్రాంగానికి అందడంలో జాప్యం నెలకొంది. అర్ధరాత్రి వేళ ఓటింగ్ 72.83 శాతంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. అయితే, ఇది అధికారికం మాత్రం కాదు అని, సరాసరిగా లెక్కించామని వివరించారు. కుగ్రామాలు, అటవీ గ్రామాలు, గిరిజన తాండాల నుంచి ఓటింగ్ శాతం నమోదు కావాల్సి ఉందని, తుది జాబితాను శుక్రవారం మధ్యాహ్నం ప్రకటిస్తామని పేర్కొన్నారు.
అయితే, అనూహ్యంగా శుక్రవారం రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం వెబ్సైట్ ఆన్లైన్ సేవలు ఆగాయి. దీంతో ఆయా జిల్లాల నుంచి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా చేరాల్సిన ఓటింగ్ శాతం వివరాలు స్తంభించాయి. మరమ్మతులు: ఆన్లైన్ సేవలకు ఆటంకం ఏర్పడటంతో యుద్ధ ప్రాతిపదికన ఐటీ నిపుణులు రంగంలోకి దిగారు. అయితే, సేవల పునరుద్ధరణలో జాప్యం నెలకొంది. మరమ్మతులు ఆలస్యం కావడంతో తుది జాబితాను అధికార పూర్వకంగా వెల్లడించలేని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి వేళ ఆన్లైన్ సేవలు పునరుద్ధరించారు. ఆయా లోక్ సభ నియోజకవర్గాల వారీగా వచ్చిన ఓటింగ్ నమోదును క్షుణ్ణంగా ఎన్నికల అధికారులు పరిశీలించారు. అందుకు తగ్గ జాబితాను సిద్ధం చేశారు.
విడుదల : పూర్తి వివరాలతో సేకరించిన జాబితాను మధ్యాహ్నం మీడియాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ విడుదల చేశారు. రాష్ట్రంలో 73.67శాతం ఓటింగ్ జరిగిందని అధికారికంగా వెల్లడించారు. ఇందులో పురుషుల కంటే, మహిళలు అత్యధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 73.49 శాతం మంది, మహిళలు 73.85 శాతం మంది ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఇతరులు 12.72 శాతం మంది ఓట్లు వేశారు. ధర్మపురి లోక్‌సభలో అత్యధికంగా 81.07 శాతం మంది ఓట్లు వేశారు. రాష్ట్రంలోనే ఇక్కడ పురుషులు అత్యధికంగా 81.58 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిదంబరం లోక్ సభలో రాష్ట్రంలోనే అత్యధికంగా మహిళలు 81.91 శాతం మంది ఓట్లు వేశారు. మైలాడుతురైలో ఇతరులు 100 శాతం ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.
చెన్నైలో తగ్గిన ఓటింగ్: రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ ఈ సారి తగ్గింది. 2009 ఎన్నికల్లో ఉత్తర చెన్నైలో 64.91 శాతం, దక్షిణ చెన్నైలో 62.66 శాతం, సెంట్రల్ చెన్నైలో 64.93 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే, ఈ సారి ఓటింగ్ శాతం తగ్గింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా ఓట్లు నమోదైన స్థానాల జాబితాలో చెన్నైలోని లోక్‌సభ నియోజకవర్గాలు చేరాయి. దక్షిణ చెన్నై అత్యల్పంగా 60.40 శాతంగా ఓటింగ్ నమోదు అయింది. ఉత్తర చెన్నైలో 63.95, సెంట్రల్ చెన్నైలో 61.49 శాతంగా ఓట్లు నమోదు అయ్యాయి. కాగా, కోయంబత్తూరు, కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాధపురం, శ్రీ పెరంబదూరుల్లో ఓటింగ్ 70 శాతానికి కిందే నమోదు అయ్యాయి. ఆరణిలో 80 శాతం, పెరంబలూరులో 80.2 శాతం నమోదు కాగా, తగ్గిన అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ 70 నుంచి 80 శాతంలోపు నమోదైంది. ఇక, ఆలందూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 64.47 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇందులో పురుషులు 66.20, స్త్రీలు 62.73 శాతం ఓట్లు వేశారు.
అధికారం అప్పగింత: ఎన్నికలు ముగియడంతో అధికార పగ్గాల్ని ప్రభుత్వానికి ఎన్నికల యం త్రాంగం అప్పగించింది. సీఎం జయలలిత, మంత్రులు తమ రోజు వారి ప్రభుత్వ వ్యవహారాల్లో, కార్యక్రమాల్లో నిమగ్నం కావచ్చని ఈసీ ప్రకటించింది. అయితే, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోకూడదని, వారితో ఎలాంటి సమావేశాలు, సమీక్షలు మంత్రులు జరిపేం దుకు వీలు లేదని మెలిక పెట్టింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా, ఎలాంటి కొత్త ఉత్తర్వులు, ప్రకటనలు చేయడానికి, ఎవరినీ బదిలీ చేయడాని వీలు లేదని ఈసీ స్పష్టం చేసింది.