ఏమిటీ ‘శిక్ష’ణ!
ఉండి : జిల్లాలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ తరగతులు తమకు శిక్షగా మారాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి జిల్లాలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు తమ పాలిట శాపంగా మారాయంటూ వాపోతున్నారు. తరగతులు ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కావడం వరకు బాగానే ఉన్నా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇళ్లకు వెళ్ళాలంటే ప్రాణం పోయేలా ఉంటోందంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నందున ఈ శిక్షణ తరగతులను వాయిదా వేయాలని కోరినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని రావద్దని చెబుతున్న వైద్యుల సలహాలను, కలెక్టర్ ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
బెంబేలెత్తుతున్న ఉపాధ్యాయులు
ఉపాధ్యాయుల్లో చాలా మంది బీపీ, సుగర్, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు. తీవ్రమైన ఎండల్లో సుమారు 20 కి.మీ ప్రయాణించి శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఉండి మండలంలోని ఉండి జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం తొలిరోజునే ఉప్పులూరు మెయిన్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సరసా సత్యనారాయణ వడదెబ్బకు ప్రాణాపాయ స్థితికి చేరారు. వెంటనే దగ్గరలోని మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో శిక్షణ తరగతిలోనే కళ్ళుతిరిగిపడిపోయారు. దాంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. శిక్షణా కార్యక్రమం ముగిసిన అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే ముందు వాతావరణాన్ని కూడా అంచనా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇవీ శిక్షణ మండలాలు
ఉండి, ద్వారకాతిరుమల, కామవరపుకోట, వీరవాసరం, మోగల్తూరు, నిడదవోలు, తాళ్లపూడి, పెనుమంట్ర, పోలవరం, ఇరగవరం, పెనుగొండ, ఛాగల్లు మండలాల్లో సుమారు మండలానికి 100 నుంచి 150 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణ శిబిరాలకు హాజరవుతున్నారు.
వచ్చే నెలకు మార్చాలి
మండుటెండల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం దారుణం. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని వడగాల్పుల్లో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ప్రాణాల మీదకు తెస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి వచ్చే నెలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తే మంచిది.
- గాదిరాజు రంగరాజు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, చెరుకువాడ.