ఏపీ డీజీపీ పోస్టుపై రాజకీయ నీడలు!
సాక్షి, అమరావతి : శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన డీజీపీ పోస్టు రాజకీయ చట్రంలో చిక్కుకుంది. డీజీపీ నండూరి సాంబశివరావు సర్వీస్ పొడిగింపు(ఎక్స్టెన్షన్)పై నిన్న మొన్నటి వరకు సుముఖంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మనసు మార్చుకోవడంతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది జూలై 26వతేదీ నుంచి పాదయాత్ర చేసేందుకు ప్రయత్నిస్తున్న ముద్రగడను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముద్రగడ ఆగస్టు 27న పోలీస్ వలయాన్ని చేధించి కిర్లంపూడి నుంచి రాజుపాలెం వరకు పాదయాత్ర కొనసాగించటంతో ప్రభుత్వానికి మింగుడు పడలేదు. ఇదే అదనుగా కొందరు మంత్రులు దీన్ని డీజీపీ మెడకు చుట్టినట్టు తెలిసింది.
సీఎం సీరియస్ కావడంతో ముద్రగడను అరెస్టు చేస్తారా? నేనే రావాలా? అంటూ డీజీపీ నేరుగా తూర్పుగోదావరి పోలీస్ అధికారులను హెచ్చరించారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు రాజుపాలెం వద్ద ముద్రగడను అరెస్టు చేసి ఇంటికి తరలించిన పోలీసులు గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే డీజీపీపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం మాత్రం ఇంకా చల్లారలేదు.
రేసులో ముగ్గురు..
డీజీపీ సాంబశివరావు ఈ ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సర్వీస్‌ను మరో రెండేళ్లు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని భావించినా కొందరు అడ్డుపడటంతో సీఎం మనసు మారినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 1985 బ్యాచ్‌కు చెందిన మాలకొండయ్య, 1986 బ్యాచ్‌కు చెందిన కౌముదిలతోపాటు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ పేర్లను డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్ ప్యానల్‌కు ప్రతిపాదిస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్న మాలకొండయ్యకు మరో ఏడాది ఆర్టీసీ ఎండీగా ఎక్స్టెన్షన్ ఇస్తామని నచ్చజెప్పి రేసు నుంచి తప్పించాలని భావిస్తున్నారు. ఏపీ క్యాడర్‌కు చెందిన కౌముది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ)లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఆయనను ఏపీకి తీసుకొచ్చి డీజీపీ పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలో ఠాకూర్‌ను డీజీపీగా చేయాలని ఓ యువనేత పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.