VV High School ground
-
‘వీవీ’లు ఓకే..
ఖమ్మంసహకారనగర్/నేలకొండపల్లి: ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్ల(వీవీ)ను నియమించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత విద్యా సంవత్సరం పని చేసిన వారిని రెన్యువల్ చేసేందుకు అనుమతిచ్చింది. జిల్లావ్యాప్తంగా 471 మంది విద్యా వలంటీర్లను కొనసాగించేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఉపాధ్యాయులు లేని జిల్లాలోని 6 పాఠశాలలకు కొందరిని అత్యవసరంగా నియమించగా.. రెండు, మూడు రోజుల్లో మిగతా పాఠశాలల్లో వీరిని నియమించనున్నారు. జిల్లాలో 1,294 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,98,944 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో బాలికలు 96,936 మంది ఉండగా.. బాలురు 1,02,008 మంది ఉన్నారు. వీరందరికీ మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పటికీ అందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో మాత్రం ఆలస్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాదికేడాది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందుతున్నా.. కొత్త టీచర్ల నియామకం ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఒక్క ఉపాధ్యాయుడే రెండు, మూడు తరగతులకు బోధించాల్సి వస్తోంది. లేనిపక్షంలో విద్యావలంటీర్లతోనే ఎలాగోలా నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తీర్పునకు అనుకూలంగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యా వలంటీర్లను ప్రతి ఏటా రెన్యువల్ చేయాలంటూ పలువురు కోర్టును ఆశ్రయించగా.. వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులను భర్తీ చేసేవరకు వీరిని ఏటా రెన్యువల్ చేయాలని తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో విద్యా శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. అయితే ప్రభుత్వం రెన్యువల్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో 471 మంది విద్యా వలంటీర్లను రెన్యువల్ చేయనున్నారు. మండలాలవారీగా ఉద్యోగ విరమణ పొందనున్న ఉపాధ్యాయులు, ఏర్పడనున్న ఖాళీలు, దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారు, ఇతర కారణాలతో ఖాళీలు, ఇతర అవసరాల రీత్యా వలంటీర్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని డీఈఓ కార్యాలయం నుంచి ఎంఈఓలకు ఆదేశాలు అందాయి. ఈసారి కూడా.. గత ఏడాది కాలంలో జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు అనేక మంది ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఈ ఏడాది విద్యావలంటీర్లు అదనంగా అవసరం అవుతారనే ఆలోచనలో విద్యా శాఖ ఉంది. ఈ క్రమంలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో భర్తీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది దాదాపు 731 మంది విద్యా వలంటీర్ల అవసరం ఉంటుందని గుర్తించారు. ఈ మేరకు అంతమందిని నియమించుకునేందుకు అనుమతి కోరుతూ జిల్లా విద్యా శాఖ.. ఉన్నతాధికారులకు నివేదికను పంపించింది. అయితే ప్రస్తుతానికి 471 మంది విద్యా వలంటీర్ల రెన్యువల్‌కు ఆమోదం లభించింది. అందని వేతనాలు.. 2018–19 విద్యా సంవత్సరానికి జిల్లావ్యాప్తంగా విద్యా వలంటీర్లకు ప్రతి నెలా వేతనాలు అందలేదు. మూడు, నాలుగు నెలలకోసారి వేతనాలు జమ చేస్తున్నారు. వీరికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 12వ తేదీ వరకు వేతనాలు అందించాల్సి ఉంది. నెలకు రూ.12వేల చొప్పున పెండింగ్ వేతనాలు రావాల్సి ఉంది. విద్యా సంవత్సరం ముగిసి, తిరిగి ప్రారంభమైనా నేటి వరకు వేతనాలు అందలేదంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నా.. సమాన వేతనాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్పించు కుని నెలనెలా వేతనాలు జమ చేయాలని కోరుతున్నారు. -
వేసవిలోనే ‘వీవీల’ నియామకం!
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయుల కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో విద్యావలంటీర్ల (వీవీ) నియామకాలను చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది. అయితే, ప్రతీ సంవత్సరం జూన్, జూలై మాసంలో వీవీల నియామకాలు చేపట్టగా, ఈసారి మాత్రం ఈ వేసవిలోనే నియామకాలు జరగనున్నట్లు ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నాయి. బడులు తెరిచిన మొదటి రోజే ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో వీవీల ద్వారా విద్యాబోధన చేయించడానికి విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందగా, నోటిఫికేషన్ విడుదల కాగానే నియామకాలు చేపట్టేందుకు వారు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, పదవి విరమణ పొందే ఉపాధ్యాయుల వివరాలను సేకరించి ఆ ఖాళీలకు అవసరమయ్యే వీవీల సంఖ్యను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వేసవి సెలవుల్లోనే విద్యావలంటీర్ల నియామకాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకోగా, ఈ నిర్ణయం విద్యార్థులకు బోధనాపరంగా ఎంతో మేలు చేయనుంది. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయ పోస్టులు చాలానే ఖాళీగా ఉండడంతో కొన్నేళ్లుగా వీవీలతోనే కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం టీఆర్టీ నిర్వహించినప్పటికీ నియామకాలు చేపట్టకపోవడంతో విద్యావలంటీర్లతోనే బోధన చేయించాల్సి వస్తోంది. అయితే, ప్రతియేటా పాఠశాల ప్రారంభమైన తర్వాత ఒకట్రెండు నెలల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి వీవీలను భర్తీ చేసేవారు. అప్పటి వరకు విద్యార్థులకు బోధించే వారు లేకపోవడంతో పాఠాలు ముందుకు సాగేవి కావు. తాజాగా ప్రభుత్వం ఈ పద్ధతికి స్వస్తి పలికి వేసవి సెలవుల్లోనే వీవీల నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే వీవీల నియామకానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే ఆరోపణలూ లేకపోలేదు. పాత వారిని కూడా కొనసాగిస్తారా..? ఆదిలాబాద్ జిల్లాలో 2018–19 విద్యా సంవత్సరంలో 417 మంది విద్యావలంటీర్లు ఆయా పాఠశాలలో విధులు నిర్వర్తించారు. వీరిలో 154 మంది లాంగ్వేజ్ పండితులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో పని చేసిన వారిని కొనసాగిస్తూనే అదనంగా కొత్తవారిని నియమిస్తారా.. లేక మొత్తం కొత్త వారినే నియమిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా అధికారులు తెలిపారు. ప్రతిసారీ బడులు ముగియగానే విద్యావలంటీర్లను బాధ్యతలను తొలగించి, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి కొత్తవారిని నియమిస్తున్నారు. ఇది వరకు పనిచేసిన వారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకొని నిబంధనల ప్రకారం పోస్టును దక్కించుకోవాల్సి వస్తోంది. దీంతో తాత్కాలికంగా పని చేస్తున్న బోధకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పాత వారిని అలాగే కొనసాగించాలని హైకోర్టు సూచించడంతో పాత వీవీలకు ఊరట లభించింది. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పాత వారితోపాటు అదనంగా 121 వీవీ పోస్టుల భర్తీ చేయాల్సిన అవసరముందని విద్యాశాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఇటీవల టీఆర్టీ ఫలితాలు విడుదల చేసినా, ఇంకా నియామకాలు చేపట్టలేదు. అదేగానీ జరిగితే పాఠశాలల్లో బోధనపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అవుతుంది. ప్రతిపాదనలు పంపించాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల వివరాలను పంపించాం. గతేడాది జిల్లాలో 417 మంది విద్యావలంటీర్లు పని చేయగా, ఈ ఏడాది అదనంగా 121 మంది అవసరమున్నట్లు నివేదికలో ప్రభుత్వానికి వివరించాం. ఈసారి కూడా మొత్తం కొత్త విద్యావలంటీర్లనే నియమించాలా.. లేక పాతవారిని కూడా కొనసాగించాలనే విషయంపై మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీవీల నియామక చర్యలు చేపడతాం. – రవీందర్‌రెడ్డి, డీఈవో -
ముగిసిన రెండు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు
మఠంపల్లి : మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకుని శుభవార్త చర్చి ఆధ్వర్యంలో మఠంపల్లిలోని వీవీ హైస్కూల్ మైదానంలో శుభోదయ యూత్ సభ్యులు నిర్వహిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు ముగిశాయి. కాగా బుధవారం రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగిన సీనియర్ విభాగం పోటీలలో ఖమ్మం జిల్లా పాతలింగాలకు చెందిన ఆర్ఎన్.రెడ్డి, నంది బ్రీడింగ్‌బుల్ సెంటర్ గిత్తలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50వేల బహుమతిని కైవసం చేసుకున్నాయి. అలాగే కృష్ణా జిల్లా బడిగంకు చెందిన రామభద్ర నందిబ్రీడింగ్ సెంటర్ గిత్తలు రెండవ స్థానంలో నిలిచి రూ.40 వేలు, నల్లగొండ జిల్లా మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బోయపాటి రఫేల్‌రెడ్డి మెమోరియల్ గిత్తలు మూడవ స్థానంలో నిలిచి రూ.30వేల బహుమతిని గెలుపొందాయి. గుంటూరు జిల్లా నిమ్మగడ్డ వారి పాలెంకుచెందిన కన్నెగంటి శంషయ్యచౌదరి గిత్తలు నాలుగో స్థానంలో నిలిచి రూ.25వేలు, గుంటూరు జిల్లా సీతారామపురంకు చెందిన దాసా నారాయణరావు గిత్తలు ఐదవ బహుమతిగా రూ.20వేలు, నల్లగొండ జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురంకు చెందిన కొప్పుల శ్రీనివాసరెడ్డి గిత్తలు ఆరవ స్థానంలో నిలిచి రూ.10 వేలు గెలుపొందాయి. అర్ధరాత్రి వరకు జరిగిన పోటీలను తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ చిన్నయ్య, బ్రదర్ రవి కుమార్‌రెడ్డి, శుభోదయ యూత్ అధ్యక్షుడు తిరుమలరెడ్డి బాలశౌరెడ్డి, సర్పంచ్ స్రవంతికిషోర్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు గోపు రాజారెడ్డి, క్రిబ్కో ఆర్జేబీ మెంబర్ గాదె ఎలియాస్‌రెడ్డి పాల్గొన్నారు.