'దక్షిణభారతదేశంలో ఇలాంటి జలపాతం లేదు'
నేరడిగొండ(ఆదిలాబాద్): దక్షిణ భారతదేశంలోనే కుంటాల లాంటి చక్కటి జలపాతం మరెక్కడా లేదని, ఇక్కడ దట్టమైన అడవులు, కొండ మధ్యలో ఎత్తయిన జలపాతం దృశ్యాలు ఉండడంతో మరిన్ని ఎక్కువ సినిమాలు తీయడానికి ఆస్కారం ఉందని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అభిప్రాయం వ్యక్తంచేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతం వద్ద ప్రముఖ కథానాయకుడు నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సినిమాలో జలపాతానికి సంబంధించిన సన్నివేశం ఉండడంతో ఇక్కడికి రావాల్సి వచ్చిందని వినాయక్ పేర్కొన్నారు. కుంటాల వద్ద రుద్రమదేవితోపాటు కొన్ని సినిమాలు, సీరియల్స్ కూడా తీశారని, ఇక్కడ ఉన్న మిత్రులైన నిరంజన్‌రెడ్డి, రంగా ద్వారా తెలిసిందన్నారు. దీంతోనే ఇటీవల ఇక్కడి ప్రాంతాలను సందర్శించి వెళ్లినట్లు తెలిపారు. కాగా, ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదని, ప్రముఖ హీరో నితిన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వీవీ వినాయక్ వివరించారు.