సెమీస్‌లో అవధ్ వారియర్స్
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2) రెండో సీజన్లో అవధ్ వారియర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో మూడో విజయంతో ప్రస్తుతం అవధ్ (18 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ల జోరుతో అవధ్ వారియర్స్ 4–3తో బెంగళూరు బ్లాస్టర్స్‌పై జయభేరి మోగించింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో విన్సెంట్ వాంగ్ వింగ్ కి (వారియర్స్) 11–13, 7–11తో సౌరభ్ వర్మ (బ్లాస్టర్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఇక ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ వారియర్లే గెలిచారు. మిక్స్డ్ డబుల్స్‌లో సావిత్రి అమిత్రాపాయ్–బోదిన్ ఇసారా (వారియర్స్) జోడి 11–9, 4–11, 11–5తో సిక్కిరెడ్డి–కొ సంగ్ హ్యూన్ (బ్లాస్టర్స్) జంటను ఓడించింది.
పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో శ్రీకాంత్ (వారియర్స్) 11–9, 11–9తో విక్టర్ అక్సెల్సన్ (బ్లాస్టర్స్)పై విజయం సాధించాడు. అనంతరం మహిళల సింగిల్స్ పోరును అవధ్ తమ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో సైనా నెహ్వాల్ 9–11, 11–5, 11–5తో చెంగ్ ఎన్గన్ యి (బ్లాస్టర్స్)పై గెలిచి బోనస్ పాయింట్‌తో మరో మ్యాచ్ మిగిలుండగానే జట్టుకు విజయాన్ని ఖాయం చేసింది. పురుషుల డబుల్స్‌లో జరిగిన తమ ట్రంప్ మ్యాచ్‌లో బెంగళూరు జోడీ కొ సంగ్ హ్యూన్– యూ యిన్ సియెంగ్ జంట 6–11, 11–9, 11–6తో గో షెమ్–మార్కిస్ కిడో (వారియర్స్) జోడీపై గెలిచింది. ఆదివారం రాత్రి ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ 4–1తో బెంగళూరు బ్లాస్టర్స్‌ను ఓడించింది. మంగళవారం బెంగళూరులోనే జరిగే మ్యాచ్‌లో ముంబై రాకెట్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడుతుంది.