సంతకాలు చేస్తేనే జట్టులో ఉంటారు
ఆటగాళ్లను హెచ్చరించిన సీఏ
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఆ దేశ ఆటగాళ్లకు మధ్య కొనసాగుతున్న వేతనాల ఒప్పంద ప్రక్రియ మరింతగా ముదిరింది. నూతన ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నేటి (శుక్రవారం)తో గడువు ముగుస్తుందని, ఈలోగా స్పందించకపోతే జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశం ఉండదని సీఏ హెచ్చరించింది.
‘జూన్ 30న మీ ఒప్పందం ముగిసిపోతే ఇక నుంచి సీఏ, రాష్ట్ర క్రికెట్ సంఘం, బిగ్‌బాష్ లీగ్ జట్టులో సభ్యులుగా ఉండేందుకు వీలుండదు’ అని సీఏ హైపెర్ఫామన్స్ మేనేజర్ పాట్ హోవర్డ్ స్పష్టం చేశారు. ఇదే జరిగితే బంగ్లాదేశ్, భారత్ పర్యటనలతో పాటు యాషెస్ సిరీస్ కూడా సందేహంగా మారనుంది. మరోవైపు సీఏ ఒప్పందం ఇవ్వకపోతే విదేశీ టి20 లీగ్‌ల్లో ఆడేందుకు ఆటగాళ్లు సిద్ధపడుతున్నా... దీనికోసం కచ్చితంగా బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని హోవర్డ్ స్పష్టం చేశారు.