Wage bill
-
అమల్లోకి వేతన చట్టం
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో 50 కోట్ల మందికి కనీస వేతనం అందేలా కేంద్రం తీసుకొచ్చిన ‘వేతనాల చట్టం– 2019’ అమల్లోకి వచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లో జూలై 30న లోక్‌సభ, ఆగస్టు 2న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. ఆగస్టు 8న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఈ బిల్లును ఆమోదించటంతో చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కనీస వేతనాలు, బోనస్‌లు, సమాన వేతనాలు వంటి నిబంధనలు కలిగిన నాలుగు చట్టాల స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం వర్తక సంఘాలు, ఉద్యోగులు, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో వేతనాలు నిర్ణయమవుతాయి. వివక్షకు తావు లేకుండా పురుషులతో సమానంగా మహిళలు, ట్రాన్‌జెండర్స్ వేతనాలు పొందేందుకు కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. వేతన పరిమితితో పనిలేకుండా అన్ని రంగాల కార్మికులకూ కనీస వేతనం సకాలంలో అందేలా నిబంధనలను ఇందులో పొందుపరిచారు. -
వేతన కోడ్‌కు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించేందుకు వీలు కల్పించే వేతనాల కోడ్ –2019 బిల్లును రాజ్యసభ ఆమోదించింది. వేతనాలు, బోనస్‌లకు సంబం ధించిన వివిధ నిబంధనలు, సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఇది చట్ట రూపం దాల్చితే దేశ వ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు లాభం కలుగుతుందని కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సభలో తెలిపారు. సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 85 మంది, వ్యతిరేకంగా 8 మంది ఓటేశారు. కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో ఇది అమల్లోకి రానుంది. ఈ బిల్లుకు లోక్‌సభ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదిం చిన 24 సవరణల్లో 17 సవరణలను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి గంగ్వార్ తెలిపారు. అయితే, కనీస జీవన పరిస్థితుల ఆధారంగా కనీస వేతనాలను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తీసుకోబోమన్నారు. కార్మిక సంఘాలు, యజమానులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే త్రిసభ్య కమిటీలే కనీస వేతనాలను నిర్ణయిస్తాయన్నారు. అదేవిధంగా, వేతనాల విషయంలో స్త్రీ, పురుష, ట్రాన్స్‌జెండర్లంటూ వివక్ష ఉండబోదన్నారు. వేతన పరిమితితో పనిలేకుండా అన్ని రంగాల కార్మికులకూ కనీస వేతనం సకాలంలో అందేలా నిబంధనలు పొందుపరిచామన్నారు. ప్రస్తుతం ఉన్న వేర్వేరు కార్మిక చట్టాలు వేతనానికి 12 రకాలైన నిర్వచనాలిచ్చాయని, దీంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తాజా బిల్లుతో ఇటువంటి సమస్యలుండవన్నారు. జూలై 30వ తేదీన ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. -
అధికారి నిర్లక్ష్యం..కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాపం!
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న విధంగా ఉంది రాజీవ్ విద్యామిషన్ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి. ప్రభుత్వం వేతనాల గ్రాంటును విడుదల చేసినా సకాలంలో బిల్లులు తయారు చేయని కారణంగా వేతనాలు చెల్లించడంలో జాప్యం కలుగుతోంది. ఒక అధికారి నిర్లక్ష్య ధోరణి రాజీవ్ విద్యామిషన్ కింద పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు శాపంగా పరిణమించింది. - మోర్తాడ్ మండల ఉద్యోగుల వేతనాల బిల్లు పంపడంలో జాప్యం - జిల్లాలోని అన్ని మండలాల వారికీ వేతనాలు నిలుపుదల - ఇబ్బందులు పడుతున్న రాజీవ్ విద్యామిషన్ ఉద్యోగులు మోర్తాడ్ : రాజీవ్ విద్యామిషన్ పథకం కింద మోర్తాడ్ మండల విద్యావనరుల కేంద్రం పరిధిలో పని చేస్తున్న 11 మంది కాంట్రాక్టు ఉద్యోగుల జూలై నెల వేతనాల బిల్లును జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి ఈ నెల ఐదో తేదీ వరకు పంపాల్సి ఉంది. జిల్లాలోని మిగతా మండలాల ఉద్యోగుల వేతనాల బిల్లులను ఆయా మండలాల అధికారులు సకాలంలో పంపారు. అయితే మోర్తాడ్ మండలానికి సంబంధించిన బిల్లును పంపకపోవడంతో జిల్లాలోని అన్ని మండలాల ఉద్యోగుల వేతనాలకు బ్రేక్ పడింది. జిల్లావ్యాప్తంగా 206 మంది క్లస్టర్ రీసోర్స్ పర్సన్(సీఆర్పీ)లు, 36 మంది ఎంఐఎస్‌లు, 36 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 36 మంది మెసెంజర్లు, 72 మంది ఐఈఆర్టీలు పని చేస్తున్నారు. వీరి పదవి కాలంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో పూర్తి కాగా ప్రభుత్వం మరో ఏడాది కాంట్రాక్టును పొడగించింది. కాంట్రాక్టును పొడిగిస్తూనే వేతనాలు సకాలంలో చెల్లించడానికి వీలుగా గ్రాంటును విడుదల చేసింది. ప్రతీ నెలా ఐదో తేదీలోగా వేతనాలకు సంబంధించిన బిల్లును మండల విద్యాశాఖ అధికారి తయారు చేసి జిల్లా కేంద్రంలోని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయానికి పంపాల్సి ఉంది. ఐదో తేదీలోగా వచ్చిన బిల్లులను అక్కడి అధికారులు జిల్లా కలెక్టర్ అనుమతి కోసం పంపిస్తారు. ప్రతీ నెలా పదో తేదీలోగా కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి అనుగుణంగా బిల్లులను ఐదో తేదీలోగా పంపాల్సి ఉంది. మోర్తాడ్ మండల విద్యావనరుల కేంద్రం నుంచి ఇప్పటివరకు బిల్లును పంపకపోవడంతో జిల్లాలోని మిగతా మండలాల ఉద్యోగుల వేతనాల బిల్లును ఆర్వీఎం అధికారులు కలెక్టర్ ఆమోదం కోసం పంపలేదు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల ఉద్యోగుల వేతనాల చెల్లింపు నిలచిపోయింది. ఆగస్టు నెల సగం గడచినా గత నెల వేతనాలు రాకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. మరోసారి ఇలాంటి జాప్యం లేకుండా వేతనాలు చెల్లించడానికి ఏర్పాట్లు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. బిల్లులు పంపడంలో జాప్యం కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల బిల్లులు పంపడంలో జాప్యం ఏర్పడింది. పని ఒత్తిడితోనే బిల్లులు పంపలేకపోయాం. ఇకముందు ఆలస్యం జరుగకుండా చూస్తాం. - ఎం.శ్రీనివాస్, ఎంఈవో, మోర్తాడ్ బిల్లులు అందితేనే వేతనాలు జిల్లాలోని 35 మండలాల బిల్లులు అందాయి. మోర్తాడ్ మండలానికి సంబంధించిన బిల్లు అందలేదు. అందుకే వేతనాలు చెల్లించడం వీలు కాలేదు. ప్రతీ నెల ఐదో తేదీలోపు వేతనాల బిల్లు పంపాలని గతంలోనే ఆదేశించాం. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు బిల్లులు పూర్తిగా అందితేనే వేతనాలు చెల్లిస్తాం. - వినయ్, ఫైనాన్స్ వింగ్ ఇన్చార్జి, ఆర్వీఎం