అధికారి నిర్లక్ష్యం..కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాపం! | Employees struggling Rajiv Vidya Mission | Sakshi
Sakshi News home page

అధికారి నిర్లక్ష్యం..కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాపం!

Published Mon, Aug 17 2015 4:50 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

అధికారి నిర్లక్ష్యం..కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాపం! - Sakshi

అధికారి నిర్లక్ష్యం..కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాపం!

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న విధంగా ఉంది రాజీవ్ విద్యామిషన్ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి. ప్రభుత్వం వేతనాల గ్రాంటును విడుదల చేసినా సకాలంలో బిల్లులు తయారు చేయని కారణంగా వేతనాలు చెల్లించడంలో జాప్యం కలుగుతోంది. ఒక అధికారి నిర్లక్ష్య ధోరణి రాజీవ్ విద్యామిషన్ కింద పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు శాపంగా పరిణమించింది.
 
- మోర్తాడ్ మండల ఉద్యోగుల వేతనాల బిల్లు పంపడంలో జాప్యం
- జిల్లాలోని అన్ని మండలాల వారికీ వేతనాలు నిలుపుదల
- ఇబ్బందులు పడుతున్న రాజీవ్ విద్యామిషన్ ఉద్యోగులు
మోర్తాడ్ :
రాజీవ్ విద్యామిషన్ పథకం కింద మోర్తాడ్ మండల విద్యావనరుల కేంద్రం పరిధిలో పని చేస్తున్న 11 మంది కాంట్రాక్టు ఉద్యోగుల జూలై నెల వేతనాల బిల్లును జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి ఈ నెల ఐదో తేదీ వరకు పంపాల్సి ఉంది. జిల్లాలోని మిగతా మండలాల ఉద్యోగుల వేతనాల బిల్లులను ఆయా మండలాల అధికారులు సకాలంలో పంపారు. అయితే మోర్తాడ్ మండలానికి సంబంధించిన బిల్లును పంపకపోవడంతో జిల్లాలోని అన్ని మండలాల ఉద్యోగుల వేతనాలకు బ్రేక్ పడింది. జిల్లావ్యాప్తంగా 206 మంది క్లస్టర్ రీసోర్స్ పర్సన్(సీఆర్‌పీ)లు, 36 మంది ఎంఐఎస్‌లు, 36 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 36 మంది మెసెంజర్‌లు, 72 మంది ఐఈఆర్‌టీలు పని చేస్తున్నారు. వీరి పదవి కాలంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో పూర్తి కాగా ప్రభుత్వం మరో ఏడాది కాంట్రాక్టును పొడగించింది.

కాంట్రాక్టును పొడిగిస్తూనే వేతనాలు సకాలంలో చెల్లించడానికి వీలుగా గ్రాంటును విడుదల చేసింది. ప్రతీ నెలా ఐదో తేదీలోగా వేతనాలకు సంబంధించిన బిల్లును మండల విద్యాశాఖ అధికారి తయారు చేసి జిల్లా కేంద్రంలోని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయానికి పంపాల్సి ఉంది. ఐదో తేదీలోగా వచ్చిన బిల్లులను అక్కడి అధికారులు జిల్లా కలెక్టర్ అనుమతి కోసం పంపిస్తారు. ప్రతీ నెలా పదో తేదీలోగా కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి అనుగుణంగా బిల్లులను ఐదో తేదీలోగా పంపాల్సి ఉంది. మోర్తాడ్ మండల విద్యావనరుల కేంద్రం నుంచి ఇప్పటివరకు బిల్లును పంపకపోవడంతో జిల్లాలోని మిగతా మండలాల ఉద్యోగుల వేతనాల బిల్లును ఆర్వీఎం అధికారులు కలెక్టర్ ఆమోదం కోసం పంపలేదు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల ఉద్యోగుల వేతనాల చెల్లింపు నిలచిపోయింది. ఆగస్టు నెల సగం గడచినా గత నెల వేతనాలు రాకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. మరోసారి ఇలాంటి జాప్యం లేకుండా వేతనాలు చెల్లించడానికి ఏర్పాట్లు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
 
బిల్లులు పంపడంలో జాప్యం

కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల బిల్లులు పంపడంలో జాప్యం ఏర్పడింది. పని ఒత్తిడితోనే బిల్లులు పంపలేకపోయాం. ఇకముందు ఆలస్యం జరుగకుండా చూస్తాం.
 - ఎం.శ్రీనివాస్, ఎంఈవో, మోర్తాడ్
 
బిల్లులు అందితేనే వేతనాలు

జిల్లాలోని 35 మండలాల బిల్లులు అందాయి. మోర్తాడ్ మండలానికి సంబంధించిన బిల్లు అందలేదు. అందుకే వేతనాలు చెల్లించడం వీలు కాలేదు. ప్రతీ నెల ఐదో తేదీలోపు వేతనాల బిల్లు పంపాలని గతంలోనే ఆదేశించాం. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు బిల్లులు పూర్తిగా అందితేనే వేతనాలు చెల్లిస్తాం.
 - వినయ్, ఫైనాన్స్ వింగ్ ఇన్‌చార్జి, ఆర్వీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement