ఐఐటీ విద్యార్థులపై వేతన ఒత్తిళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలో సీటు వచ్చిందంటే చాలు.. నాలుగేళ్లు గడిస్తే రూ.కోట్లలో వేతనాలు.. సంతోషకరమైన జీవితం.. ఇవీ ఐఐటీల్లో సీట్లు పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు.. ఆకాంక్షలు. కానీ భారీ వేతనాలు ఇచ్చి ప్రముఖ కంపెనీలు తీసుకెళ్లేది కొద్దిమంది విద్యార్థులనే. ఐఐటీల్లో వేల సంఖ్యలో చదివే విద్యార్థులందరికీ వచ్చేది భారీ మొత్తంలో కాదు. ఎక్కువ శాతం మందికి సాధారణ, తక్కువ వేతనాలే. ఏదో కొద్ది మంది విద్యార్థులకు వచ్చే భారీ వేతనాలను చూసి తల్లిదండ్రులు ఇతర పిల్లలపై తీవ్ర ఒత్తిడి చేస్తుండటం ఆందోళనకరంగా మారింది.
దీంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని పలు ఐఐటీలు గుర్తించాయి. అందుకే ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్ వంటి సంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లలో కంపెనీలు విద్యార్థులకు ఆఫర్ చేసే వేతనాలను, ఆ విద్యార్థుల వివరాలను వెల్లడించవద్దని నిర్ణయించాయి.
ఈ నెలలోనే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్
ఈ నెలలో క్యాంపస్ ప్లేస్మెంట్లు ప్రారంభం అవుతుండటంతో ఐఐటీలు ఈ నిర్ణయానికి వచ్చాయి. అంతేకాదు ఇటీవల గౌహతి ఐఐటీలో జరిగిన ఆల్ ఐఐటీస్ ప్లేస్మెంట్ కమిటీ సమావేశంలో అన్ని ఐఐటీల్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థులకు కంపెనీలు ఇచ్చే వేతనాల వివరాలను, ఆ విద్యార్థుల వివరాలను కూడా బయటకు వెల్లడించవద్దని నిర్ణయించాయి. 2009లోనే వేతన వివరాలను బయటకు వెల్లడించవద్దన్న నిర్ణయం తీసుకున్నా అమలుకు నోచుకోలేదు. కాని ఇపుడు మాత్రం కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు ఖరగ్‌పూర్ ఐఐటీ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ చైర్మన్ ప్రొఫెసర్ సుధీర్‌కుమార్ బరాయ్ వెల్లడించారు.
‘కంపెనీలు నియామకాల్లో భాగంగా చేసుకునే ఉద్యోగ ఒప్పందంలో రెమ్యునరేషన్‌ను బయటకు వెల్లడించవద్దన్న నిబంధన ఉంది. దీన్ని ఉల్లంఘిస్తే కంపెనీలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. భారీ వేతనాల ఆఫర్ వచ్చిన విద్యార్థులు, వారి కుటుంబాల భద్రత సమస్యగా మారుతోంది. అందుకే వేతన వివరాలు, విద్యార్థుల వివరాలను బయట పెట్టవద్దని నిర్ణయించాం..’ అని ఒక ఐఐటీకి చెందిన ప్లేస్మెంట్ సెల్ ఇన్చార్జి పేర్కొన్నారు.