ఫ్యాక్టరీ ఔట్.. వర్క్‌షాప్ ఇన్!
♦ కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి మంగళం
♦ వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్షాపుమంజూరు
♦ కేటాయించింది రూ.20 కోట్లే
సాక్షి, హైదరాబాద్: అనుకున్నదే జరిగింది! ఆరేళ్ల క్రితం కాజీపేటకు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీని రైల్వే శాఖ రద్దు చేసింది. దాని స్థానంలో వ్యాగన్ పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు మంజూరు చేసింది. ఫ్యాక్టరీ రానందుకు కనీసం వర్క్షాపుతోనైనా సంతృప్తి పడదామనుకుంటే దాన్ని కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేసేలా కనిపించడం లేదు. ఈ వర్క్‌షాపునకు రూ.269 కోట్లు అవసరం బడ్జెట్లో కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు.
ఆరేళ్ల క్రితం మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉండగా రూ.200 కోట్లతో కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేశారు. కానీ నాటి ప్రభుత్వం భూమి అందివ్వకపోవడాన్ని సాకుగా చూపి కాలయాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక భూసేకరణ ప్రక్రియ పూర్తయినా పనులు మాత్రం మొదలు కాలేదు.
చివరకు దాన్ని రద్దు చేసిన రైల్వేశాఖ.. వ్యాగన్లకు ఓవర్‌హాలింగ్ చేసే వర్క్‌షాపును కేటాయించింది. ఒకేసారి మొత్తం నిధులు కేటాయిస్తే ఈ సంవత్సరమే ఇది ఏర్పాటయ్యేది. కానీ దాన్ని కూడా కాలయాపన చేసే ఉద్దేశంతో అత్తెసరు నిధులిచ్చి చేతులు దులుపుకుంది.