చంద్రబాబు హామీలన్నీ నెరవేర్చాల్సిందే : నరహరిశెట్టి
విజయవాడ, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు డిమాండ్ చేశారు. సీటీ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్థులు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నరహరిశెట్టి మాట్లాడుతూ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామన్నారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రారుణాలు రద్దు, ఇంటికో ఉగ్యోగం వంటి హామీలను చంద్రబాబు నెరవేర్చాలని సూచించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఇప్పటికే చంద్రబాబు స్వరం మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎటువంటి ఆటంకం లేకుండా బాబు కొనసాగించాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగడానికి కారణమయిన కలెక్టర్, ఎస్పీ, పోలీస్ కమిషనర్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల జరి గిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బూత్‌స్థాయి నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు దేవి నేని అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలో లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడతామని, ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. ఆకుల శ్రీనివాసరావు, వేములపరమేశ్వరరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేంద్రం, సుంకర పద్మశ్రీ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.