హాంఫట్
- కబ్జాదారుల గుప్పిట్లో వక్ఫ్ ఆస్తులు
- 8,100 ఎకరాలు అన్యాక్రాంతం
- విలువ రూ.500 కోట్ల పైమాటే
- పాప కార్యంలో ముతవల్లులు, ముజావర్ల భాగస్వామ్యం
- వక్ఫ్ బోర్డును వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లాలో వక్ఫ్ ఆస్తులకు రక్షణ కరువైంది. మసీదు, ఈద్గాహ్, దర్గాల నిర్వహణ, పరిరక్షణ కోసం కేటాయించిన భూములు అక్రమార్కుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాలను తమ ఆధీనంలో పెట్టుకొని ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. వీటి విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుంది. అన్యాక్రాంత భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. సిబ్బంది కొరత కారణంగా ఆస్తులపై వక్ఫ్‌బోర్డు పర్యవేక్షణ కొరవడింది. ఇదే అదనుగా భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. వక్ఫ్ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.
కర్నూలు (రాజ్‌విహార్) : ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ తరువాత అత్యధికంగా ముస్లింలు ఉన్న జిల్లా కర్నూలు. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు ఉన్నది కూడా ఈ జిల్లాలోనే. మసీదులు, ఈద్గాహ్, దర్గాల నిర్వహణ కోసం నాడు పెద్దలు తమ భూములు, స్థలాలను ఇచ్చారు. వాటిని ఆయా సంస్థల పేరుతో బోర్డుకు స్వాధీనం చేశారు. వాటిని బోర్డు తమ భూములుగా పేర్కొంటూ వివరాలను గెజిట్‌లో పొందుపర్చింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,104 సంస్థలు వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్నాయి. వీటిలో 741 సంస్థలు ఆస్తులు కలిగి ఉన్నాయి. వీటి పేర్లతో 22,599.89 ఎకరాల భూములు గెజిట్‌లో నమోదయ్యాయి. మరో పది వేల ఎకరాలు నమోదు కాలేదు. గెజిట్‌లో ఉన్న 3,099.35 ఎకరాలతో పాటు గెజిట్‌లో లేని మరో ఐదు వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. కోర్టులకెళ్లడంతో 639.84 ఎకరాలను బోర్డు కోల్పోయింది. అన్యాక్రాంత ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
కఠిన చట్టాలున్నా..
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కఠిన చట్టాలున్నా అక్రమార్కుల ఆగడాలు మాత్రం కొనసాగుతున్నాయి. వక్ఫ్ యాక్ట్ 52(1) అమెండ్మెంట్ 2013 ప్రకారం ఈ ఆస్తులు కొన్న, అమ్మిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. కానీ ఇప్పటి వరకు 50లోపే కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కరిపైనా చార్జిషీట్ దాఖలు కాలేదు. స్థలాలు అమ్ముతున్న ముతవల్లులు, ముజావర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. మసీదులు, దర్గాల నిర్వహణ చూసే ముతవల్లులు, ముజావర్లు ఆ భూములను సాగుచేసుకుంటూ వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని (వక్ఫ్ ఫండ్) ప్రతియేటా బోర్డుకు చెల్లించాలి. అయితే.. కొందరు సొంత భూముల్లా భావించి అమ్మేసుకుంటున్నారు. ప్రస్తుతమున్న భూముల నుంచి ఏటా రూ.25 లక్షలకు పైగా వక్ఫ్ఫండ్ రావాల్సి ఉండగా, రూ.12 లక్షల్లోపే వస్తున్నట్లు సమాచారం.
వేధిస్తున్న సిబ్బంది కొరత
వక్ఫ్‌బోర్డులో సిబ్బంది కొరత వేధిస్తోంది. రూ.వందల కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములున్న ఈ జిల్లాలో కేవలం ఇద్దరితో కాలం గడుపుతున్నారు. ఇక ఇన్స్పెక్టర్, ఒక అటెండర్ మాత్రమే ఉండడంతో ఆస్తులపై పర్యవేక్షణ కొరవడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెలన్నరకు పైగా కార్యాలయానికి దూరంగా ఉన్న అజీమ్‌తో పాటు ఇష్టానుసారం విధులకు హాజరవుతున్న అల్తాఫ్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆక్రమణకు గురైన భూముల వివరాలు
– కర్నూలు మండలం దిన్నేదేవరపాడు గ్రామం సర్వే నంబర్-19లో 59.59 ఎకరాల భూమి 20ఏళ్ల క్రితం ఆక్రమణకు గురైంది. ఇప్పుడు దీని విలువ రూ.40 కోట్లకు పైమాటే.
–కర్నూలు నగర శివారులోని జొహరాపురం రోడ్డులో సర్వే నంబర్లు 142, 154, 155, 162లో పాత బస్టాండ్‌లోని బుడాన్ఖాన్ మసీదుకు చెందిన 60 ఎకరాలు అన్యాక్రాంతమైంది. దీని విలువ రూ.35కోట్లకు పైగా ఉంటుంది. కంచే చేను మేసిన చందంగా ఓ రిటైర్డు తహశీల్దారు, లే సెక్రటరీ హస్తం ఉందని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
– కర్నూలు గ్రామ సర్వే నంబర్ -62లో 5.32 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. ఇందులో పశువుల షెడ్డు ఏర్పాటు చేశారు.
– మునగాలపాడులోని సర్వే నంబరు 93, 146లో 19 ఎకరాలు ఆక్రమణకు గురైంది. దీని విలువ రూ. 5 కోట్ల వరకు ఉంటుంది.
– కల్లూరు పరిధి, కలెక్టరేట్ వెనుకాల ఉన్న రాయలసీమ క్రిష్టియన్ కళాశాల వద్ద సర్వే నంబరు 922లో 7.60 ఎకరాల భూమి అక్రమార్కుల గుప్పిట్లో ఉంది. దీని విలువ రూ.8కోట్లకు పైమాటే.
నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం – ఇనాయత్, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్
వక్ఫ్ ఆస్తులను అనధికారికంగా అనుభవిస్తుంటే స్వచ్ఛందంగా వచ్చి స్వాధీనపర్చాలి. లేనిపక్షంలో ముందుగా నోటీసులిస్తాం. స్పందించకపోతే వక్ఫ్ చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపుతాం. ఇప్పటివరకు 50కి పైగా కేసులు పెట్టాం. ఈ విషయాన్ని ఆక్రమణదారులు గమనించాలి.
జిల్లాలో వక్ఫ్ సంస్థలు, ఆస్తుల వివరాలు
––––––––––––––––––––––
ఆస్తులు కలిగిన సంస్థలు : 741
ఆస్తులు లేని సంస్థలు : 363
వక్ఫ్‌బోర్డు పరిధిలోని మొత్తం ఆస్తులు : 22,599.89 ఎకరాలు
భూ సేకరణలో ప్రభుత్వం తీసుకున్నది : 1,200.42 ఎకరాలు
ఆక్రమణకు గురైన భూములు : 3,099.35 ఎకరాలు
ఆక్రమణకు గురై గెజిట్‌లో లేని భూములు : 5 వేల ఎకరాలు
కోర్టుల్లో బోర్డు కోల్పోయిన భూమి : 639.84 ఎకరాలు
బోర్డు చర్యల్లో ఉన్న భూమి : 850.06 ఎకరాలు
అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్నది : 79 ఎకరాలు
ప్రస్తుతం ఆధీనంలో ఉన్నది : 18,660.28 ఎకరాలు