క్రికెటర్ బిల్లు కట్టిన అభిమాని
కరాచీ: పాకిస్థాన్ టి20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది మరోసారి పతాక శీర్షికలకు ఎక్కాడు. అభిమానితో బిల్లు కట్టించడంతో అతడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లు ఆడేందుకు పాకిస్థాన్ టీమ్ అక్లాండ్ చేరుకుంది. అక్కడ దిగిన తర్వాత సహచర ఆటగాడు అహ్మద్ షెహజాద్ తో కలిసి అక్కాండ్ విమానాశ్రయంలోని మెక్ డొనాల్డ్ రెస్టరెంట్ కు వెళ్లాడు ఆఫ్రిది.
బిల్లు చెల్లించే సమయంలో అమెరికా డాలర్లు ఇవ్వడంలో రెస్టరెంట్ సిబ్బంది తీసుకోలేదు. న్యూజిలాండ్ కరెన్సీయే కావాలని వారు కోరారు. అక్కడే ఉన్న పాకిస్థాన్ క్రికెట్ అభిమాని వకాస్ నవీద్ తన దగ్గరున్న డబ్బుతో వారి బిల్లు చెల్లించాడు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీయడంతో వీటిని పాకిస్థాన్ చానళ్లు పదేపదే ప్రసారం చేశాయి. దీనిపై ఆఫ్రిది వివరణ ఇచ్చాడు.
తమ దగ్గరనున్న అమెరికా డాలర్లను న్యూజిలాండ్ కరెన్సీలోకి మార్చుకోవడం మర్చిపోయామని ఆఫ్రిది తెలిపాడు. తమను ఆహ్వానించడానికి వచ్చిన అభిమాని బిల్లు చెల్లించాడని చెప్పాడు. ఏదేమైనా మీడియా మరోసారి వినోదం అందించిందని వ్యంగ్యంగా అన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు తాను పెద్ద ఫ్యాన్ అని వకార్ నవీద్ తెలిపాడు.