ప్రభుత్వ ఆస్పత్రిలో.. ఆధిపత్య పోరు..!
రెండు వర్గాలుగా విడిపోయిన వైద్యులు
⇒ ‘నవజాత’లో ఆరోగ్యశ్రీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు
⇒ చిన్నారుల వైద్యసేవలకు విఘాతం
⇒ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న సూపరింటెండెంట్
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధిపత్య పోరు తార స్థాయికి చేరింది. రెండు వర్గాలుగా విడిపోయిన వైద్యులు ఓ వర్గంపై మరో వర్గం వారు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద అందుతున్న సేవలకు ప్రభుత్వం వైద్యులకు, సిబ్బందికి ఇస్తున్న ప్రోత్సాహక నిధులే డాక్టర్ల మధ్య విభేదాలకు కారణంగా తెలుస్తోంది.
నల్లగొండటౌన్:
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రిలో ఐదేళ్ల క్రితం నవజాత శిశుసంరక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్థాయిలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఈ కేంద్రం గుర్తింపు తెచ్చుకుంది.
28 వారాలకే కేవలం 650 గ్రాముల బరువుతోనే తల్లి గర్భం నుంచి భూమ్మీదకొచ్చిన ‘బాహుతల్లి’కి ఈ కేంద్రంలోనే చికిత్స చేశారు.155 రోజుల పాటు ఆ శిశువుకు సేవలందించి బతికించిన ఘనకీర్తి ఈ నవజాత శిశు సంరక్షణ కేంద్రం సొంతం. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడే ఈ కేంద్రంలో ఆరోగ్య శ్రీ కింద చిన్నారులకు అందుతున్న వైద్య సేవలే డాక్టర్ల మధ్య పొరపొచ్చాలకు కారణమయ్యాయి.
ఆరోగ్య శ్రీ నిధుల కిరికిరి
నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో నిత్యం వందల మంది చిన్నారులకు సేవలందిస్తుంటారు. అవసరం ఉన్న శిశువులకు ఆరోగ్య శ్రీ పథకం కింద కూడా చికిత్స నిర్వహిస్తారు. అయితే, ఈ పథకం కింద ప్రభుత్వం విడుదల చేసే నిధులే ప్రస్తుతం వైద్యుల కిరికిరికి ప్రధాన కారణం. ఆరోగ్య శ్రీ పథకం కింద ఓ చిన్నారికి రూ. లక్ష వరకు వైద్య సేవలు అందిస్తే ప్రభుత్వం వైద్యులకు 20 శాతం, కేంద్రం మొత్తం సిబ్బందికి మరో 15 శాతం నిధులను పోత్సాహకంగా అందజేస్తుంది. దీంతో ఈ కేంద్రం నిర్వాహకులు అవసరం ఉన్నా లేకున్నా ఆరోగ్యశ్రీ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ లబ్ధి పొందుతున్నారని ఆస్పత్రి ఉన్నత స్థాయి వైద్యుల ప్రధాన ఆరోపణ. అయితే నిబంధనల మేరకు చికిత్స అందజేస్తున్నామని ఆ కేంద్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు. వివిధ రకాల జబ్బులతో బాధపడే చిన్నారులను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతే ఆరోగ్య శ్రీ పథకానికి ఆమోదించాలని పంపుతున్నామని, ఇందులో దుర్వినియోగానికి పాల్పడే ఆస్కారమే లేదనేది వారి వాదన.
చిన్నారుల తల్లిదండ్రుల ఆందోళన
అయితే. డాక్టర్ల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా చిన్నారులకు అందే చికిత్సకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడుతుండడంతో చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కలుగుతున్న తరుణంలో వైద్యులు వృత్తిధర్మాన్ని విస్మరిస్తూ పోరుకు సై అంటుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తేనే వైద్యుల మధ్య నెలకొన్న వివాదానికి తెరపడి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఉన్నతాధికారులకు నివేదిస్తా
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహిస్తున్న నవజాత శిశు సంరక్షణ కేంద్రంపై ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమే. ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. ఈ కేంద్రం ద్వార ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తోన్న సేవలు వివాదాలకు కారణమవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులకు నివేదిస్తా.
– నర్సింగరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్