కబ్జా కోరల్లో ఖాళీ స్థలాలు
– బాలసముద్రం లే ఔట్లో రిజిస్ట్రేషన్‌పై అనుమానాలు
– సుబేదారి పోలీసుస్టేçÙన్లో ఐదుగురిపై బల్దియా ఫిర్యాదు
– ఇంకా వెలుగులోకి రాని రూ.వందల కోట్ల విలువైన స్థలాలు
వరంగల్ అర్బన్l: వరంగల్ మహా నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు పాగా వేస్తున్నారు. అయితే, ఇందులో ప్రైవేట్ స్థలాలు ఉంటే వాటి యజమానులు కేసులు పెట్టి న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. మరి ప్రభుత్వ భూములైతే కాపాడుకోవాల్సిన బల్దియా అధికారులకు మాత్రం ఇదేమీ పట్టడం లేదు. ట్రై సిటీలో లే ఔట్ ఖాళీ స్థలాలు అనాదిగా ఆక్రమణకు గురవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా బాలసముద్రంలోని లే ఔట్ స్థలం ఆక్రమణపై బల్దియా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆక్రమణలపై ఎప్పటికప్పుడు మేల్కొనపోతే మరికొన్ని స్థలాలు కబ్జాకోరల్లో చిక్కుకోవడం ఖాయమనే వాదనలు వినవస్తున్నాయి.
డీజీఐఎస్ ద్వారా గుర్తింపు
బల్దియాకు సంబంధించి లే ఔట్ స్థలాలను డిజిటల్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(డీజీఐఎస్) సిస్టమ్ ద్వారా గుర్తించాలని ఏడాది క్రితం కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను అదేశించారు. అంతేకాకుండా 1947 నుంచి 2014 చివరి నాటికి ట్రైసిటీ పరిధిలోని లే ఔట్ స్థలాల మ్యాపులు, వివరాలను హైదరాబాద్‌లోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ నుంచి తెప్పించారు. మ్యాపులను స్కాన్ చేసి, డీజీఐఎస్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తున్నారు. దీంతో మొత్తం 657 లే ఔట్ ఖాళీ స్థలాలు ఉన్నట్లు లెక్క తేలింది. అయితే, బల్దియా రికార్డుల్లో కేవలం 163 లే ఐట్ ఖాలీ స్థలాల వివరాలే ఉండడం గమనార్హం. ఈ మేరకు మిగిలిన 493 స్థలాలను గుర్తించి నివేదిక రూపంలో సమర్పించాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ అదేశించారు. అలాగే, విలీన గ్రామాల్లోని లే ఔట్ స్థలాలు, భవనాలు, ఖాళీ స్థలాలు, కార్యాలయాల వివరాలను సేకరించాలని ఆదేశించడంతో రెండు నెలల ఆస్తుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
వివాదాల్లో విలువైన స్థలాలు
బల్దియా పరిధిలోని పలు కాలనీల్లో ఉన్న స్థలాలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి. బల్దియా పరిధిలోని ట్రైసిటీలో 40 నుంచి 60 స్థలాలపై కబ్జాదారులు కన్నేసినట్లు సమాచారం. బాలసముద్రంలోని 15 స్థలాలు ఉండగా, అందులో చాలా మేరకు కబ్జాకు గురయ్యాయి. ఎక్సైజ్ కాలనీలో 10 లే ఔట్ ఖాళీ స్థలాలు ఉండగా.. ఇందులో ఆరు నుంచి ఏడు స్థలాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. బల్దియా, ‘కుడా’ అధికారుల సమన్వయ లోపంగా కారణంగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి బల్దియా స్థలాలు చేరాయి. అదే విధంగా సుబేదారి జేసీ క్యాంపు కార్యాలయం వెనుకాల రూ.కోట్ల విలువైన లే ఔట్ స్థలంపై ప్రైవేట్ వ్యక్తులు కన్నేశారు. కొందరు అధికారులు అండదండలతో ఆ స్థలంలో కొంతభాగం కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. ఫారెస్టు ఆఫీస్ సమీపంలోని 500 గజాల స్థలానికి సంబంధించి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రియల్ వ్యాపారుల చేతిలోకి వెళ్లినట్లు సమాచారం. ఇక వరంగల్ ఉర్సు సుభాష్ నగర్, రంగశాయిపేటల్లో పార్కు స్థలాన్ని కొంత మంది అక్రమించుకోగా, కరీంనగర్ ప్రధాన రహదారి సమీపంలోని ఒక నాయకుడు.. బల్దియా లే ఔట్‌కు సంబంధించి ఆరు ఖాళీ స్థలాలను విక్రయించారని తెలుస్తోంది.
1066 సర్వేనంబర్‌లో రిజిస్ట్రేషన్లు
హన్మకొండ బాలసముద్రంలో ఐదు దశాబ్దాల క్రితం లే ఔట్ చేశారు. దీనికి సంబంధించి 1066 సర్వే నంబర్లో 15 ఖాళీ స్థలాలు ఉన్నాయి. 2010–11 సంవత్సరంలో బల్దియా బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా కరుణాకర్ ఉన్న సమయంలో 200 గజాల చొప్పున నలుగురి పేరిట 800 గజాల స్థలం రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు బల్దియాలో కనిపించడం లేదు. తాజాగా ఈ విషయం బయట పడడంతో మేయర్ నన్నపునేని నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలతో బల్దియా టౌన్ ప్లానింగ్ ఇన్చార్జ్ సీపీ కోదండరాంరెడ్డి, ఏసీపీ శైలజలు సుబేదారి పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. కొనుగోలుదారులుగా భావిస్తున్న నలుగురితో పాటు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా గతంలో ఏకశిలా పార్కు సమీపంలోని 500, నుంచి 600 గజాల ఖాళీ స్థలాన్ని బల్దియా అధికారులు విక్రయించారు. ఇది వివాదస్పదంగా మారింది. రెండేళ్ల కిందట బదిలీ అయిన కమిషనర్ అధ్వర్యంలో అప్పటి సిటీ ప్లానర్ నేతృత్వంలో రూ.10కోట్ల విలువైన భూములు అప్పన్నంగా అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అనేక స్థలాలకు సంబంధించి వివాదాలు కొనసాగుతుండగా.. మరికొన్ని స్థలాలు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఈ మేరకు బల్దియా పాలకవర్గం, అధికారులు స్పందించి బల్దియా ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించకపోతే రూ.కోట్ల విలువైన స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ఖాయమనే చెప్పాలి.