warangal dustrict
-
మనిషిని పోలిన మనిషి.. ఆ ఊళ్లో 17 మంది ట్విన్స్..
సాక్షి, నర్సంపేట/రాయపర్తి(వరంగల్): ఒకే పోలిక.. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే.. జిరాక్స్ టూ జిరాక్స్, ఒకే డ్రెస్.. ఇట్లా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పవచ్చు. కవలలు ఎదురైతే ఆశ్చర్యంగా చూస్తాం. కొందరు తల్లిదండ్రులైతే ఒకే రకమైన డ్రెస్ కవలలిద్దరికీ వేస్తారు. కుటుంబ సభ్యులు సైతం గుర్తుపట్టేందుకు తటపటాయిస్తారు. అలా కవలలు ఎక్కడున్నా వారిది ప్రత్యేక స్థానమే. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పెర్కవేడు గ్రామంలో ఏకంగా 17 మంది కవలలు(34 మంది) ఉండడం విశేషం. నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కవలల ఊరు! తెలంగాణలో ఏ ఊళ్లో లేనట్లుగా రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామంలో ఎక్కువ మంది కవలలున్నారు. ఐదువేల జనాభా ఉన్న ఈ ఊళ్లో దాదాపు వెయ్యికి పైగా ఇండ్లుంటాయి. ఇక్కడ 17 మంది కవలుండడం విశేషం. కవలలు జన్మించడం చాలా అరుదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది కవలలుండం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గ్రామంలోని కవలలు చదువులు, ఉద్యోగాలరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ పండుగలకు, పబ్బాలకు మాత్రం గ్రామానికి వస్తుంటారు. అలా వచ్చినప్పుడు అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది. వారిని గుర్తుపట్టడానికి. ఒకేలా తాతలు.. గొళ్లపల్లి రామయ్య, లక్ష్మయ్యలు కవలలు. వీరిది పెర్కవేడు. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఒకరు కొండూరులో, మరొకరు స్వగ్రామంలో ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ తాము గొడవపడలేదని చెబుతున్నారు. ఏ కార్యానికైనా కలిసికట్టుగా వెళ్తామని రాముడు, లక్ష్మణుడిలా ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటామని చెబుతున్నారు రామయ్య, లక్ష్మయ్యలు. ఇప్పటికీ ఆ కుటుంబంలో ఐకమత్యానికి వీళ్లిద్దరినీ ఉదాహరణగా తీసుకుంటారు. చదవండి: కరీంనగర్: రూ.34 లక్షలు.. కాదు కాదు.. రూ.14లక్షలు...! కార్తీజన్వి– కృతిజన్వి నర్సంపేట మండలం మాధన్నపేట శివారు భోజ్యనాయక్ తండాకు చెందిన అజ్మీర విజయ్‌కుమార్–ప్రేమలత దంపతులకు 2016 డిసెంబర్లో కార్తిజన్వి–కృతిజన్వి జన్మించారు. వీరికి తల్లిదండ్రులు ప్రతీ రోజు ఒకే రకమైన డ్రెస్‌లు వేయడంతో ఇరుగుపొరుగు వారికి గుర్తు పట్టడం కూడా కష్టమే. వాణి–వీణ రాయపర్తి గ్రామానికి చెందిన దొడ్డ కృష్ణమూర్తి, సత్యవతికి రెండో సంతానంగా మానస(వాణి)మౌనిక(వీణ) జన్మించారు. మొదటి నుంచి ఇద్దరు చదువులో ముందుండేవారు. మానస(వాణి) ఎంఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్‌లో మెడికల్ కోడింగ్‌లో పని చేస్తోంది. మౌనిక(వీణ) బెంగళూరులో ఓప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఇద్దరిలో ఎవరొకరు ఇంటికొచ్చినా ఇప్పటికీ కాలనీవాసులు గుర్తుపట్టడానికి ఇబ్బందులు పడతారు. ఫుర్ఖాన్–అఫాన్ నర్సంపేట పట్టణానికి చెందిన మహ్మద్ ఫయిజుద్దీన్ అరిఫాబేగం దంపతులకు మొదటి సంతానంలో కవలలు జన్మించారు. ఫుర్ఖాన్–అఫాన్ వీరిద్దరూ ఇంట్లో, బయటా ఐక్యంగా ఉంటారు. అభిరుచులు, అలవాట్లు కూడా ఒకేలా ఉంటాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. అర్మన్‌షాహా–ఫర్మన్‌షాహా నర్సంపేటలో ఉపాధ్యాయుడు ఖాసీంషాహా హసీన దంపతుల కుమారులు అర్మన్‌షాహా–ఫర్మన్‌షాహా కవలలు. ఇద్దరూ ఒకే పోలికతో ఉండడంతో అందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కవలలు పుట్టడం తమ అదృష్టమని తల్లిదండ్రులు చెబుతున్నారు. చదవండి: ఆ ఆలోచనతో 30 శాతం మరణం ముప్పు తగ్గుతుంది: హార్వర్డ్ పరిశోధన ప్రత్యేక గుర్తింపు! మా గ్రామంలో ఇంతమంది కవలలు ఉండడం సంతోషం. ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మా ఊళ్లో జన్మించిన కవలలు అంతా వేరే ఊళ్లల్లో పనులు చేసుకుంటున్నా.. పండుగల పూట గ్రామానికి వస్తారు. అలాంటి సమయంలో ఒక్కోసారి తికమకగా ఉంటుంది. ఒక ఊరిలో ఒకటి లేదా రెండు కవలల జంటలుంటాయి. కానీ మా ఊళ్లో ఏకంగా 17 కవలల జంటలున్నాయి. మా ఊరికి ఇదో ప్రత్యేక గుర్తింపుగా కూడా చెప్పవచ్చు. – చిన్నాల తారశ్రీరాజబాబు, సర్పంచ్, పెర్కవేడు -
ఎక్సైజ్ పాలసీపై ఆశావహుల్లో చర్చ
సాక్షి, వరంగల్: ‘ఎక్సైజ్ పాలసీ 2019–21 కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రానున్నాయా.. లేదంటే పాత పద్ధతిలోనే టెండర్లు నిర్వహిస్తారా.. అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త ఎక్సైజ్ పాలసీలో ఏ మేరకు మార్పులు ఉంటాయి?’ ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే చర్చ. సెప్టెంబర్ 30తో మద్యం దుకాణాల గడువు ముగియనుండడంతో కొత్తగా ఈ రంగాన్ని ఎంచుకునే వారు.. యధాతథంగా కొనసాగాలనుకునే వ్యాపారులు, ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. 2017లో జరిగిన టెండర్ల సందర్భంగా ఆగస్టు మొదటి వారంలోనే ప్రభుత్వం కొత్త పాలసీ, టెండర్లపై విధి విధానాలను ప్రకటించింది. దీంతో భారీ సంఖ్యలో మద్యం దుకాణాల కోసం పోటీ పడ్డారు. ఒక్కో దుకాణానికి మూడు నుంచి 85 వరకు దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 265 మద్యం దుకాణాలపై కేవలం దరఖాస్తుల రూపేణా మద్యనిషేధం, అబ్కారీశాఖకు రూ.75.27 కోట్ల ఆదాయం లభించింది. 2015–17 కోసం ఆరు స్లాబ్‌లు, ఒక్కో దరఖాస్తుకు రూ.50 వేలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించిన ప్రభుత్వం.. 2017–19కి వచ్చే సరికి నాలుగు స్లాబ్‌లు, దరఖాస్తు ధర రూ.లక్షకు పెంచింది. దీంతో ఎక్సైజ్‌శాఖకు ఆదాయం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ప్రభుత్వం పాలసీలో ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తుందా.. లేక పాత పద్ధతినే అమలు చేస్తుందా అనే చర్చ సాగుతోంది. అయితే ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఉన్న మార్గదర్శకాల ప్రకారమే టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గత శ్లాబ్‌లు ఇలా.. ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా రెండు పర్యాయాలు వేర్వేరు విధానాలను పాటించింది. 2015–17 ఎక్సైజ్ పాలసీలో ఆరు స్లాబులు విధించింది. మేజర్ గ్రామపంచాయతీలకు సంబంధించి మొదటి స్లాబ్‌గా రూ.39.50 లక్షలు, మండల కేంద్రాలోరెండో స్లాబ్‌గా రూ.40.8 లక్షలు ఎక్సైజ్ టాక్స్ విధించారు. అదే విధంగా లక్ష నుంచి 2 లక్షల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు, 2 లక్షల నుంచి 3 లక్షల జనాభా ఉంటే రూ.60 లక్షలు, 3 లక్షల జనాభా పైబడి ఉంటే రూ.81.6 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1.08 కోట్లుగా నిర్ణయించారు. 2017–19 పాలసీకి వచ్చే సరికి ఆరు శ్లాబ్‌లను నాలుగుకు తగ్గించారు. 50 వేల జనాభా ఉండే ప్రాంతాల్లో రూ.45 లక్షలు కాగా, 50,001 నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ.55 లక్షలు, 5,00,001 నుంచి 20 లక్షల జనాభా వరకు రూ.85 లక్షలు, 20 లక్షలపై జనాభా ఉండే చోట రూ.1.10 కోట్లుగా మార్పు చేశారు. ప్రస్తుతం ఈ పాలసీ వచ్చే నెల 30తో ముగియనుండగా.. కొత్త విదివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో 2019–21 ఎక్సైజ్ పాలసీ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ, ఆసక్తి ఆశావహుల్లో మొదలైంది. బార్ లైసెన్సుల రెన్యూవల్ యధాతథం వైన్స్‌షాపుల టెండర్ల విషయంలో కొంత సస్పెన్స్ నెలకొనగా... బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సులను మాత్రం యధాతథంగా రెన్యూవల్ చేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 265 వైన్స్ (ఏ–4) ఉండగా 100 బార్ అండ్ రెస్టారెంట్లు, 17 ఎలైట్ బార్లు ఉన్నాయి. ఇందులో వరంగల్ అర్బన్ జిల్లాలో 59 వైన్స్, 88 బార్లు, 11 ఎలైట్ బార్లు ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 58 వైన్స్, 3 బార్లు, 4 ఎలైట్ బార్లు, జనగామలో 42 వైన్స్, 3 బార్లు, ఒక ఎలైట్, మహబూబాబాద్‌లో 51 వైన్స్, 3 బార్లు, ఒక ఎలైట్ బార్లు ఉన్నా యి. ఇక జయశంకర్ భూ పాలపల్లి, ములుగు జిల్లాల్లో 55 వైన్స్, మూడు బార్లు ఉన్నాయి. ఇందులో 100 బా ర్లు, 17 ఎలైట్ బార్లకు సె ప్టెంబర్ నెలా ఖరులోగా రెన్యూవల్ చేయనున్నారు. వైన్స్‌కు మాత్రం ఇంకా మా ర్గదర్శకాలు రావాల్సి ఉండగా ఈ సా రి వైన్స్‌షాపు ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా దరఖాస్తులు కూడా పోటెత్తుతాయని భావిస్తున్నారు. గత టెండర్లలో 265 దుకాణాలకు గాను 7,527 దరఖాస్తులు వచ్చాయి. త్వరలోనే మార్గదర్శకాలు వచ్చే అవకాశం 2019–21 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. త్వరలోనే కొత్త ఎక్సైజ్ పాలసీ వెలువడే అవకాశముంది. వచ్చే నెల 30వ తేదీతో వైన్స్ గడువు ముగుస్తుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తాము. – సురేష్ రాథోడ్, డిప్యూటీ కమిషనర్, మద్యనిషేధం, అబ్కారీ శాఖ, వరంగల్ -
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు
వరంగల్ జిల్లా: ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఆకేరు వాగు వద్ద జరిగింది. హన్మకొండ మండలం మామునూర్ గ్రామానికి చెందిన ఎస్సై ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని 18 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అంతేకాకుండా ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో తదుపరి చర్యల కోసం వర్ధన్నపేట ఎమ్మార్వోకు సమాచారం అందించారు. (వర్ధన్నపేట)