సాక్షి, వరంగల్: ‘ఎక్సైజ్ పాలసీ 2019–21 కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రానున్నాయా.. లేదంటే పాత పద్ధతిలోనే టెండర్లు నిర్వహిస్తారా.. అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త ఎక్సైజ్ పాలసీలో ఏ మేరకు మార్పులు ఉంటాయి?’ ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే చర్చ. సెప్టెంబర్ 30తో మద్యం దుకాణాల గడువు ముగియనుండడంతో కొత్తగా ఈ రంగాన్ని ఎంచుకునే వారు.. యధాతథంగా కొనసాగాలనుకునే వ్యాపారులు, ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. 2017లో జరిగిన టెండర్ల సందర్భంగా ఆగస్టు మొదటి వారంలోనే ప్రభుత్వం కొత్త పాలసీ, టెండర్లపై విధి విధానాలను ప్రకటించింది. దీంతో భారీ సంఖ్యలో మద్యం దుకాణాల కోసం పోటీ పడ్డారు.
ఒక్కో దుకాణానికి మూడు నుంచి 85 వరకు దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 265 మద్యం దుకాణాలపై కేవలం దరఖాస్తుల రూపేణా మద్యనిషేధం, అబ్కారీశాఖకు రూ.75.27 కోట్ల ఆదాయం లభించింది. 2015–17 కోసం ఆరు స్లాబ్‌లు, ఒక్కో దరఖాస్తుకు రూ.50 వేలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించిన ప్రభుత్వం.. 2017–19కి వచ్చే సరికి నాలుగు స్లాబ్‌లు, దరఖాస్తు ధర రూ.లక్షకు పెంచింది. దీంతో ఎక్సైజ్‌శాఖకు ఆదాయం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ప్రభుత్వం పాలసీలో ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తుందా.. లేక పాత పద్ధతినే అమలు చేస్తుందా అనే చర్చ సాగుతోంది. అయితే ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఉన్న మార్గదర్శకాల ప్రకారమే టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.
గత శ్లాబ్‌లు ఇలా..
ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా రెండు పర్యాయాలు వేర్వేరు విధానాలను పాటించింది. 2015–17 ఎక్సైజ్ పాలసీలో ఆరు స్లాబులు విధించింది. మేజర్ గ్రామపంచాయతీలకు సంబంధించి మొదటి స్లాబ్‌గా రూ.39.50 లక్షలు, మండల కేంద్రాలోరెండో స్లాబ్‌గా రూ.40.8 లక్షలు ఎక్సైజ్ టాక్స్ విధించారు. అదే విధంగా లక్ష నుంచి 2 లక్షల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు, 2 లక్షల నుంచి 3 లక్షల జనాభా ఉంటే రూ.60 లక్షలు, 3 లక్షల జనాభా పైబడి ఉంటే రూ.81.6 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1.08 కోట్లుగా నిర్ణయించారు. 2017–19 పాలసీకి వచ్చే సరికి ఆరు శ్లాబ్‌లను నాలుగుకు తగ్గించారు. 50 వేల జనాభా ఉండే ప్రాంతాల్లో రూ.45 లక్షలు కాగా, 50,001 నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ.55 లక్షలు, 5,00,001 నుంచి 20 లక్షల జనాభా వరకు రూ.85 లక్షలు, 20 లక్షలపై జనాభా ఉండే చోట రూ.1.10 కోట్లుగా మార్పు చేశారు. ప్రస్తుతం ఈ పాలసీ వచ్చే నెల 30తో ముగియనుండగా.. కొత్త విదివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో 2019–21 ఎక్సైజ్ పాలసీ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ, ఆసక్తి ఆశావహుల్లో మొదలైంది.
బార్ లైసెన్సుల రెన్యూవల్ యధాతథం
వైన్స్‌షాపుల టెండర్ల విషయంలో కొంత సస్పెన్స్ నెలకొనగా... బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సులను మాత్రం యధాతథంగా రెన్యూవల్ చేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 265 వైన్స్ (ఏ–4) ఉండగా 100 బార్ అండ్ రెస్టారెంట్లు, 17 ఎలైట్ బార్లు ఉన్నాయి. ఇందులో వరంగల్ అర్బన్ జిల్లాలో 59 వైన్స్, 88 బార్లు, 11 ఎలైట్ బార్లు ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 58 వైన్స్, 3 బార్లు, 4 ఎలైట్ బార్లు, జనగామలో 42 వైన్స్, 3 బార్లు, ఒక ఎలైట్, మహబూబాబాద్‌లో 51 వైన్స్, 3 బార్లు, ఒక ఎలైట్ బార్లు ఉన్నా యి. ఇక జయశంకర్ భూ పాలపల్లి, ములుగు జిల్లాల్లో 55 వైన్స్, మూడు బార్లు ఉన్నాయి. ఇందులో 100 బా ర్లు, 17 ఎలైట్ బార్లకు సె ప్టెంబర్ నెలా ఖరులోగా రెన్యూవల్ చేయనున్నారు. వైన్స్‌కు మాత్రం ఇంకా మా ర్గదర్శకాలు రావాల్సి ఉండగా ఈ సా రి వైన్స్‌షాపు ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా దరఖాస్తులు కూడా పోటెత్తుతాయని భావిస్తున్నారు. గత టెండర్లలో 265 దుకాణాలకు గాను 7,527 దరఖాస్తులు వచ్చాయి.
త్వరలోనే మార్గదర్శకాలు వచ్చే అవకాశం
2019–21 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. త్వరలోనే కొత్త ఎక్సైజ్ పాలసీ వెలువడే అవకాశముంది. వచ్చే నెల 30వ తేదీతో వైన్స్ గడువు ముగుస్తుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తాము.
– సురేష్ రాథోడ్, డిప్యూటీ కమిషనర్, మద్యనిషేధం, అబ్కారీ శాఖ, వరంగల్
Comments
Please login to add a commentAdd a comment