మనిషిని పోలిన మనిషి.. ఆ ఊళ్లో 17 మంది ట్విన్స్‌.. | Twins Day: 17 Twins In Perukavedu Village In Warangal | Sakshi
Sakshi News home page

మనిషిని పోలిన మనిషి.. ఆ ఊళ్లో 17 మంది ట్విన్స్‌..

Published Tue, Feb 22 2022 2:57 PM | Last Updated on Tue, Feb 22 2022 5:16 PM

Twins Day: 17 Twins In Perukavedu Village In Warangal - Sakshi

సాక్షి, నర్సంపేట/రాయపర్తి(వరంగల్‌): ఒకే పోలిక.. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే.. జిరాక్స్‌ టూ జిరాక్స్‌, ఒకే డ్రెస్‌.. ఇట్లా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పవచ్చు. కవలలు ఎదురైతే ఆశ్చర్యంగా చూస్తాం. కొందరు తల్లిదండ్రులైతే ఒకే రకమైన డ్రెస్‌ కవలలిద్దరికీ వేస్తారు. కుటుంబ సభ్యులు సైతం గుర్తుపట్టేందుకు తటపటాయిస్తారు. అలా కవలలు ఎక్కడున్నా వారిది ప్రత్యేక స్థానమే. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని పెర్కవేడు గ్రామంలో ఏకంగా 17 మంది కవలలు(34 మంది) ఉండడం విశేషం. నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

కవలల ఊరు!
తెలంగాణలో ఏ ఊళ్లో లేనట్లుగా రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామంలో ఎక్కువ మంది కవలలున్నారు. ఐదువేల జనాభా ఉన్న ఈ ఊళ్లో దాదాపు వెయ్యికి పైగా ఇండ్లుంటాయి. ఇక్కడ 17 మంది కవలుండడం విశేషం. కవలలు జన్మించడం చాలా అరుదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది కవలలుండం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గ్రామంలోని కవలలు చదువులు, ఉద్యోగాలరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ పండుగలకు, పబ్బాలకు మాత్రం గ్రామానికి వస్తుంటారు. అలా వచ్చినప్పుడు అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది. వారిని గుర్తుపట్టడానికి.

ఒకేలా తాతలు..
గొళ్లపల్లి రామయ్య, లక్ష్మయ్యలు కవలలు. వీరిది పెర్కవేడు. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఒకరు కొండూరులో, మరొకరు స్వగ్రామంలో ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ తాము గొడవపడలేదని చెబుతున్నారు. ఏ కార్యానికైనా కలిసికట్టుగా వెళ్తామని రాముడు, లక్ష్మణుడిలా ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటామని చెబుతున్నారు రామయ్య, లక్ష్మయ్యలు. ఇప్పటికీ ఆ కుటుంబంలో ఐకమత్యానికి వీళ్లిద్దరినీ ఉదాహరణగా తీసుకుంటారు.
చదవండి: కరీంనగర్‌: రూ.34 లక్షలు.. కాదు కాదు.. రూ.14లక్షలు...!

కార్తీజన్వి– కృతిజన్వి
నర్సంపేట మండలం మాధన్నపేట శివారు భోజ్యనాయక్‌ తండాకు చెందిన అజ్మీర విజయ్‌కుమార్‌–ప్రేమలత దంపతులకు 2016 డిసెంబర్‌లో కార్తిజన్వి–కృతిజన్వి జన్మించారు. వీరికి తల్లిదండ్రులు ప్రతీ రోజు ఒకే రకమైన డ్రెస్‌లు వేయడంతో ఇరుగుపొరుగు వారికి గుర్తు పట్టడం కూడా కష్టమే. 

వాణి–వీణ
రాయపర్తి గ్రామానికి చెందిన దొడ్డ కృష్ణమూర్తి, సత్యవతికి రెండో సంతానంగా మానస(వాణి)మౌనిక(వీణ) జన్మించారు. మొదటి నుంచి ఇద్దరు చదువులో ముందుండేవారు. మానస(వాణి) ఎంఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్‌లో మెడికల్‌ కోడింగ్‌లో పని చేస్తోంది. మౌనిక(వీణ) బెంగళూరులో ఓప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఇద్దరిలో ఎవరొకరు ఇంటికొచ్చినా ఇప్పటికీ కాలనీవాసులు  గుర్తుపట్టడానికి ఇబ్బందులు పడతారు. 

ఫుర్ఖాన్‌–అఫాన్‌
నర్సంపేట పట్టణానికి చెందిన మహ్మద్‌ ఫయిజుద్దీన్‌ అరిఫాబేగం దంపతులకు మొదటి సంతానంలో కవలలు జన్మించారు.  ఫుర్ఖాన్‌–అఫాన్‌ వీరిద్దరూ ఇంట్లో, బయటా ఐక్యంగా ఉంటారు. అభిరుచులు, అలవాట్లు కూడా ఒకేలా ఉంటాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. 

అర్మన్‌షాహా–ఫర్మన్‌షాహా
నర్సంపేటలో ఉపాధ్యాయుడు ఖాసీంషాహా హసీన దంపతుల కుమారులు అర్మన్‌షాహా–ఫర్మన్‌షాహా కవలలు. ఇద్దరూ ఒకే పోలికతో ఉండడంతో అందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కవలలు పుట్టడం తమ అదృష్టమని తల్లిదండ్రులు చెబుతున్నారు. 
చదవండి: ఆ ఆలోచనతో 30 శాతం మరణం ముప్పు తగ్గుతుంది: హార్వర్డ్‌ పరిశోధన 

ప్రత్యేక గుర్తింపు!
మా గ్రామంలో ఇంతమంది కవలలు ఉండడం సంతోషం. ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మా ఊళ్లో జన్మించిన కవలలు అంతా వేరే ఊళ్లల్లో పనులు చేసుకుంటున్నా.. పండుగల పూట గ్రామానికి వస్తారు. అలాంటి సమయంలో ఒక్కోసారి తికమకగా ఉంటుంది. ఒక ఊరిలో ఒకటి లేదా రెండు కవలల జంటలుంటాయి. కానీ మా ఊళ్లో ఏకంగా 17 కవలల జంటలున్నాయి. మా ఊరికి ఇదో ప్రత్యేక గుర్తింపుగా కూడా
చెప్పవచ్చు. 
– చిన్నాల తారశ్రీరాజబాబు, సర్పంచ్, పెర్కవేడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement