ఎన్నికల ప్రచారంలో కల్లు తాగిన డిగ్గీ..
వరంగల్: 'బీ ఎ రోమన్ ఇన్ రోమ్' సామెతను బాగా వంటపట్టించుకున్న రాజకీయ నాయకులు ఏ కుల సంఘం సమావేశానికి వెళితే వారి సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోవడం తెలిసిందే. ఈ తరహా 'కుల' కలుపుగోలు తనాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్.
వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం వరంగల్ డీసీసీ కార్యాలయంలో గౌడ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి డిగ్గీ రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పటికే గౌడ సోదరులు తీసుకొచ్చిన కల్లు లొట్టికేసి ఆసక్తిగా చూస్తున్న ఆయన.. పలువురి అభ్యర్థనమేరకు కల్లు తాగారు.
తాడు, మోకును మెడలో వేసుకుని మరీ గౌడ్లందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇటీవల తెలంగాణలో విచ్చలవిడి కల్తీ కల్లు ప్రవాహం నేపథ్యంలో డిగ్గీ మాత్రం అత్యంత స్వచ్ఛమైన కల్లునే అందించినట్లు తెలిసింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.