డీఐజీకి శౌర్య పతకం
వరంగల్ : విధి నిర్వహణలో ఉత్తమ సేవలతో పాటు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు భారత ప్రభుత్వం వరంగల్ రేంజ్ డీఐజీ టి.ప్రభాకర్‌రావుకు పోలీస్ గ్యాలంటరీ అవార్డు(శౌర్య పతకం) ప్రకటించింది. ఇటీవల నల్లగొండ జిల్లా జానకీపురం సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్ జరిగిన సమయంలో అక్కడ ఎస్పీగా ప్రభాకర్‌రావు విధులు నిర్వర్తించారు. వరంగల్ నుంచి హైదరాబాద్ జైలుకు తరలిస్తున్న సమయంలో ఉగ్రవాదులు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఆయన టీంవర్క్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందున ఈ అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల ప్రభాకర్‌రావు స్వగ్రామం. 1991 బ్యాచ్‌లో డీఎస్పీగా ఎంపికైన ఆయన జగిత్యాల డీఎస్పీగా మొదటి పోస్టింగ్ పొందారు. అనంతరం నెల్లూరు జిల్లా గూడూరు, నల్లగొండ, సరూర్‌నగర్‌లో పనిచేసి, నల్గొండ అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. అక్కడ నుంచి అడిషన్ డీసీసీ(ట్రాఫిక్)గా హైదరాబాద్‌లో పనిచేశారు. ఎస్ఐబీ ఎస్పీగా, ఈస్ట్‌జోన్ డీసీపీ, జాయింట్ కమిషనర్(డిటెక్టివ్)గా సేవలందించారు. అనంతరం నల్గొండ ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం వరంగల్ రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. గ్యాలంటరీ అవార్డుకు ఎంపికైన ప్రభాకర్‌రావుకు పలువురు అభినందనలు తెలిపారు.