అమెరికా వెళ్లేందుకు విద్యార్థికి ప్రభుత్వం చేయూత
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం లభించిన వరంగల్ విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. వరంగల్‌లోని వడ్డెపల్లికు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు ఈ.నవీన్‌కుమార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌యూసీ)లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నాడు.
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 2015 జనవరి 30 నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న ప్రపంచ సదస్సులో దేశం తరుఫున పేపర్ ప్రజెంటేషన్ కోసం ఆహ్వానం లభించింది. అమెరికా వెళ్లేందుకు నవీన్‌కుమార్‌కు తగిన ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి ఖర్చులను ప్రభుత్వం తరుఫున ఇచ్చేందుకు హమీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. రెండు లక్షలను మంజూరు చేసి, విడుదల చేశారు. శనివారం అసెంబ్లీలో సీఎం విద్యార్థి నవీన్‌కు చెక్కును అందజేసినట్లు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, వినయ్‌భాస్కర్ తెలిపారు.