రాష్ట్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక
తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తాజా బులెటిన్లో సూచించింది. తెలంగాణ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలపగా, రాయలసీమలో మాత్రం ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించింది. కోస్తా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడం, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం లాంటి చర్యలు చేపట్టాలని తెలిపింది. అత్యంత తీవ్రస్థాయిలో ఉన్న అల్పపీడనం తెలంగాణ, దానికి అనుబంధంగా ఉన్న రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలపై ఆవరించి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బులెటిన్లో పేర్కొంది.
రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతా్లో వర్షం, జల్లులు ఉంటాయని, తర్వాత క్రమంగా తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీచేసింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.