ప్రశాంతంగా గోదావరి
కొవ్వూరు : గోదావరిలో వరద నిలకడగా ఉంది. ఎగువ నుంచి వచ్చే ప్రవాహ జలాలు తగ్గిపోవడంతో వరద ఉధృతి తగ్గింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం ఆరు గంటలకు 9 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం ఆరు గంటలకు పది అడుగులకు చేరింది. ఆనకట్టకి నాలుగు ఆర్మ్ల వద్ద ఉన్న 175 గేట్లను 0.60 మీటర్లు ఎత్తులేపి ఉదయం 3,45,540 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. సాయంత్రానికి ఇన్ఫ్లో కాస్త తగ్గడంతో 2,94,387 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 13,600 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడిచిపెడుతున్నారు. దీనిలో జిల్లాలో పశ్చిమ కాలువకి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద తగ్గడంతో కొవ్వూరు గోష్పాదక్షేత్రం స్నానఘట్టంలో మెట్లు బయటపడుతున్నాయి.