ఆఫ్ ద ఫీల్డ్...
రేప్ ప్రయత్నం... బాక్సర్ అరెస్ట్
ఒలింపిక్ క్రీడా గ్రామంలో వారం రోజుల లోపే మరో బాక్సర్ అత్యాచార ఆరోపణలతో అరెస్టయ్యాడు. ప్రారంభోత్సవానికి రెండు రోజుల ముందు మొరాకో బాక్సర్ హసన్ పోలీసులకు చిక్కగా... ఈ సారి నమీబియా ఆటగాడు జొనాస్ జూనియాస్ (22) వంతు. క్రీడా గ్రామంలో ఒక మహిళను బలవంతంగా ముద్దు పెట్టుకున్న అతను... సెక్స్‌కు అంగీకరిస్తే డబ్బు ఇస్తానని కూడా ఆశ పెట్టాడు. జొనాస్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి జైల్లో పెట్టామని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ధారించారు. గురువారం అతను తన తొలి మ్యాచ్ బరిలోకి దిగాల్సి ఉంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించిన బాక్సర్ జొనాస్, రియో ఒలింపిక్స్‌లో ఆ దేశపు పతాకధారి కావడం విశేషం.
ఆనందంలో విషాదం..
ఒలింపిక్స్‌లో పతకం సాధించడమంటే ఆషామాషీ కాదు.. అలాంటి ఘనతను తన మనవడు సాధించేసరికి ఆ 84 ఏళ్ల బామ్మ ఆనందం తట్టుకోలేకపోయింది. అయితే ఆ అంతులేని ఆనందమే చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయేలా చేసింది. థాయ్‌లాండ్‌కు చెందిన 20 ఏళ్ల వెయిట్‌లిఫ్టర్ సిన్ఫెట్ కృయతోంగ్ 56 కేజీ విభాగంలో కాంస్యం సాధించాడు. ఈ పోటీలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించిన సుబిన్ ఖోంగ్తాప్ ఆనందం పట్టలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె గుండెనొప్పితో కన్నుమూసింది. దీంతో ఆ ఊరి ప్రజలు ఒక్కసారిగా విషాదంలో మునిగారు. ఈ పోటీకి ముందు మీడియాతో మాట్లాడిన బామ్మ తన మనవడు దేశానికి పతకం అందిస్తే సంతోషిస్తానని చెప్పింది.
‘నన్ను కావాలనే ఓడించారు’
‘ఐబా నేను గెలవాలని కోరుకోలేదు. అందుకే నన్ను కావాలని ఓడించింది. నా ఒలింపిక్ ఆశలను చిదిమేసింది. ఐబా అంతా అవినీతిమయం’ ఇదీ హోండురస్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజ్ బాక్సర్ టియోఫిమో లోపెజ్ ఆక్రోషం. ఆదివారం జరిగిన లైట్‌వెయిట్ 60కేజీ ప్రిలిమినరీ బాక్సింగ్ మ్యాచ్‌లో తను 27-30 తేడాతో ఫ్రాన్స్ ఆటగాడి చేతిలో ఓడాడు. నిజానికి తను అమెరికాలోనే పుట్టి పెరగడమే కాకుండా అక్కడి నుంచే ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ తనకు యూఎస్ఏ జట్టులో చోటు దక్కలేదు. దీంతో తమ సొంత దేశమైన హోండురస్ తరఫున బరిలోకి దిగాడు. తనను కావాలనే ఓడించారని లోపెజ్ ఐబాపై విరుచుకుపడ్డాడు.