వృథా క్లినిక్‌లు
ఉట్నూర్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువ క్లినిక్‌లతో ప్రయోజనం చేకూరడం లేదు. ఆయా ఆస్పత్రుల్లో యువ క్లినిక్‌లు గోడకు అంటించిన ఫ్లెక్సీలపై తప్ప సేవలు కనిపించడం లేదు. ఐటీడీఏ ద్వారా వెచ్చించిన రూ. లక్షల నిధులు వృథా అవుతున్నాయి. కౌమార దశ నుంచి యవ్వన ఆరంభ దశ(12 సంవత్సరాల నుంచి) బాలబాలికలకు వచ్చే ఆరోగ్య సమస్యలు, శారీరక మార్పులు, మానసిక ఒత్తిడిలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లైంగిక సమస్యలు, వ్యాధులపై అవగాహన కల్పించడం.. అవసరమైతే చికిత్సలు అందించడం కోసం ప్రభుత్వం యువ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం వైద్యాధికారులకు 2010 నవంబర్‌లో శిక్షణ ఇచ్చింది. శిక్షణ తీసుకున్న వారిలో 35 మంది బదిలీపై వెళ్లారు. కొత్తవారికి అవగాహన లేకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది.
నిధులు వృథా..
జిల్లా వ్యాప్తంగా 45 యువ క్లినిక్‌ల ఏర్పాటు కోసం ఐటీడీఏ రూ. 6.75 లక్షలు మంజూరు చేసింది. పీహెచ్సీలలో ఒక్కో గదిని, ఒక్కో యువక్లినిక్‌కు రూ.5 వేల చొప్పున మందులు, మౌలిక వసతులు, ప్రచారం కోసం కేటాయించింది. అయా పీహెచ్‌సీలోని మెడికల్ అధికారి, ఏఎన్ఎం, నర్సు యువ క్లినిక్‌ల ద్వారా వ్యాధులపై అవగాహన, సూచనలు, అవసరమైతే కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఇంతటి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన యువ క్లినిక్‌లు బోర్డులకే పరిమితం అవుతున్నాయి.
గదులు కేటాయించిన దాఖలాలు లేవు. నిధులు కూడా పక్కదారి పట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం 2011-12 సంవత్సరానికి నిధులు విడుదల చేసి ఆ తర్వాత నిధుల విడుదల మరవడంతో యువక్లినిక్‌లు అటకెక్కాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌ను వివరణ కోరగా యువ క్లినిక్ నిర్వహణపై ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు.