watch tower
-
వావ్.. కుంటాల జలపాతం వద్ద ‘వాచ్‌టవర్’..
సాక్షి, నేరడిగొండ(నిర్మల్): రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద రూ.10లక్షలతో నిర్మించిన వాచ్‌టవర్‌ను ఆదివారం పీసీసీఎఫ్ శోభ, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి ప్రారంభించారు. వాచ్‌టవర్‌కు ఊటచెలిమ కుంటాల వాచ్టవర్గా నామకరణం చేశారు. జలపాతం ‘యూ’ పాయింట్ వద్దకు వెళ్లి జలపాతం అందాలను తిలకించారు. కుంటాల(కె) సర్పంచ్ ఎల్లుల్ల అశోక్, వీఎస్ఎస్ చైర్మన్ నర్సయ్యలు కుంటాల జలపాతానికి వచ్చే పర్యాటకులకు మెట్ల ద్వారా దిగడం ఇబ్బందిగా ఉందని, జలపాతం వద్ద రూప్‌వే ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారి దృష్టికి తీసుకెళ్లారు. అయితే జలపాతం అభయారణ్యంలో ఉందని, రూప్‌వే నిర్మాణం సాధ్యం కాదన్నారు. వీరి వెంట సీఎఫ్ రామలింగం, డీఎఫ్‌వో రాజశేఖర్, ఉట్నూర్ ఎఫ్‌డీవో రాహుల్‌కిషన్ జాదవ్, నేరడిగొండ, సిరిచెల్మ ఎఫ్ఆర్వోలు రవికుమార్, వాహబ్ అహ్మద్, ఎఫ్ఎస్వో వసంత్‌కుమార్, ఎఫ్‌బీవో రాధకృష్ణ, అటవీ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. -
అడవుల రక్షణకు ‘వాచ్ టవర్’
దండేపల్లి: అడవుల రక్షణపై అటవీ శాఖ మరింత దృష్టి సారించింది. అడవుల్లో నిఘా పెంచేందుకు వాచ్టవర్ల నిర్మాణాలు చేపడుతోంది. జన్నారం అటవీ డివిజన్లో ఇప్పటికే దొంగపల్లి, గండిగోపాల్రావ్పేట, ఉడుంపూర్, అల్లంపల్లిలో వాచ్ టవర్లు నిర్మించింది. తాజాగా కవ్వాల్‌తోపాటు దండేపల్లి సమీపంలోని ఊట్ల మలుపుల వద్ద వాచ్ టవర్ నిర్మాణం చేపడుతోంది. దీంతో ఈ ప్రాంతంలో కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. అడవుల రక్షణలో వాచ్టవర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. టవర్లు ఎక్కి పరిశీలిస్తే అడవిలో ఎక్కడా ఏం జరుగుతున్నా తెలుసుకోవచ్చు. కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల పరిశీలన, వేసవిలో అడవుల్లో మంటలు చెలరేగిన ప్రాంతాలను గుర్తించి అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే వీలుంటుంది. తాళ్లపేట, తిర్యాణి అటవీ రేంజిల సరిహద్దు ప్రాంతమైన ఊట్ల రెండో మలుపు వద్ద చేపడుతున్న వాచ్ టవర్ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఊట్ల అటవీ ప్రాతంలో ఇప్పటికే చాలామంది పర్యాటకులు వస్తుంటారు. వాచ్ టవర్ నిర్మాణం పూర్తయితే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.