చెలరేగిన దొంగలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరంలో మంగళవారం రాత్రి ఇద్దరు దొంగలు చెలరేగిపోయారు. రెండు గంటలపాటు స్కూటీపై నగరమంతా తిరుగుతూ కనపడిన వారిపై ఇనుప రాడ్‌తో దాడి చేశారు. ఇద్దరు వాచ్మెన్లను హత్య చేసి, పలువురిని గాయపరిచారు. సుమారు పది షాపుల షట్టర్లు పగులగొట్టారు. కొన్ని షాపుల షట్టర్లు తెరుచుకోలేదు. హంతకుల్ని పోలీసులు 12 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరూ మైనర్లే. పోలీసులు వారిద్దరినీ జువైనల్ హోమ్‌కు తరలిస్తున్నారు.
రాత్రి రెండున్నర గంటల సమయంలో గుంటూరు నగరం అమరావతిరోడ్డులోని జ్వరాల ఆసుపత్రి ఎదురుగా మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న యమహా షోరూం వద్దకు స్కూటీపై ఇద్దరు మైనర్లు వచ్చారు. అందులో ఒకడు బండి వద్ద ఉండగా మరొకడు షోరూం వద్ద కుర్చీలో నిద్రపోతున్న కాపలాదారు కృపానిధి (66)పై ఇనుపరాడ్‌తో దాడి చేసి చంపేశాడు. అనంతరం షోరూం షట్టర్లు పగులగొట్టి లోపలికి వెళ్లారు. క్యాష్ కౌంటర్లో నగదు లేకపోవడంతో అక్కడ ఉన్న ఒక హెల్మెట్‌ను తీసుకుని మళ్లీ ద్విచక్ర వాహనంపై నగరంలోకి వచ్చారు.
అరండల్‌పేట 11/1 రోడ్డులోని మీసేవ కేంద్రం షట్టర్ తెరిచే ప్రయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంతో పదో రోడ్డులోకి వెళ్లారు. అక్కడ ప్రభుత్వ వైన్‌మార్ట్ వద్ద ఉన్న వాచ్మెన్ బత్తుల సాంబశివరావు (63)పై దాడి చేసి చంపేశారు. అనంతరం వైన్‌మార్ట్ తలుపు తెరిచే ప్రయత్నం చేయగా అది తెరుచుకోలేదు. దీంతో చుట్టుపక్కల నాలుగు షాపుల్లో చోరీకి ప్రయత్నం చేశారు. ఒక సెల్‌ఫోన్ షాపులో రెండు ట్యాబ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు దొంగతనం చేశారు. అలికిడికి పక్కనే ఉన్న స్వగృహా స్వీట్‌షాప్ వాచ్మెన్ బయటకు వచ్చి కేకలు పెట్టడంతో అతనిపై దాడి చేశారు.
అతను తప్పించుకుని సమీపంలోని అరండల్‌పేట పోలీసు స్టేషన్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసులకు విషయం చెప్పాడు. డ్యూటీలో ఉన్న సెంట్రీ రక్షక్ వాహనంలో వారిని వెంబడించినా తప్పించుకుపోయారు. అనంతరం అరండల్‌పేట రెండో లైన్లోనే కూర్చుని మద్యం సేవించిన దుండగులు అక్కడి నుంచి పాత గుంటూరు ఆంధ్రా బ్యాంకు వద్ద పేపర్లు కట్టలు కడుతున్న పత్రిక ఏజెంట్‌పై పేపర్ ధర ఎంత అని అడుగుతూనే రాడ్‌తో దాడి చేశారు. ఆయన సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యారు.
అనంతరం సుద్దపల్లి డొంక సమీపంలోని పాలబూత్ యజమాని ఎండ్లూరి రవికుమార్ అలియాస్ ఏసుబాబుపై దాడి చేశారు. అతని నడుముకు గాయమైంది. అక్కడి నుంచి యాదవ హైస్కూల్ వద్ద మరో వ్యక్తిపై దాడి చేశారు. అనంతరం నందివెలుగు రోడ్డులోని శ్మశానాల రోడ్డులో రెండు ఆటో ఫైనాన్స్, రెండు స్టిక్కరింగ్, ఒక కూల్‌డ్రింక్ షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. రెండు గంటల్లోనే నగరమంతా తిరుగుతూ విధ్వంసం సృష్టించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలాల్లో ఆనవాళ్లు సేకరించాయి.
ఐజీ త్రివిక్రమ వర్మ, జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, ఇతర అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకోవడానికి 8 బృందాలను రంగంలోకి దింపారు. సీసీ టీవీ ఫుటేజిల్లో నిందితుల్లో ఒకడు పాత నేరస్తుడేనని గుర్తించారు. వెంటనే అతని కుటుంబ సభ్యుల నుంచి సెల్‌ఫోన్ నంబర్ తీసుకొని, సిగ్నల్స్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు.
అతనిచ్చిన సమాచారంతో రెండో నిందితుడిని కూడా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు. గంజాయి మత్తులో వారు ఈ విధంగా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరినీ జువైనల్ హోంకు పంపుతున్నట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.