పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషి
జంగారెడ్డిగూడెం రూరల్ : రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని రాష్ట్ర స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. గురువారం మండలంలోని కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ నుంచి ఖరీఫ్ పంటకు సాగునీటిని ఆమె విడుదల చేశారు.
ఈ సందర్భంగా పీతల మాట్లాడుతూ గోదావరిలో ఏటా 724 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోతుందని, ఆ నీటిని సద్వినియోగం చేసేందుకే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించి కృష్ణా జిల్లాకు తరలిస్తున్నట్టు చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి తమ్మిలేరు, ఎర్రకాల్వ ప్రాజెక్టులను అనుసంధానం చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళుతున్నట్టు చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పూరై్తతే సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎర్రకాలువ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని సుమారు 5 వేల ఎకరాలకు 100 క్యూసెక్కుల నీరు ఖరీఫ్ పంట నిమిత్తం విడుదల చేయడం జరిగిందన్నారు. మండలంలోని శ్రీనివాసపురం, తాడువాయిలలో రూ.1.50 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్లను మంత్రి పీతల సుజాత గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, సర్పంచ్లు పి.దుర్గాదేవి, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.