నీటితొట్టిలో పడి బాలుడి మృతి
ములుగు : నీటితొట్టిలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని బండారుపల్లిలో గురువారం సాయంత్రం జరిగింది. బండారుపల్లికి చెందిన బాలుగు సుమలత, శ్రీనివాస్ దంపతులకు 16 నెలల కుమారుడు సిద్ధు ఉన్నాడు. గురువారం శ్రీనివాస్ బయటికి వెళ్లగా, సుమలత ఇంట్లో పనుల్లో నిమగ్నమైంది. సాయంత్రం 5 గంటల సమయంలో సిద్ధూ ఆడుకుంటూ బయటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి ముందున్న నీటితొట్టిలో ప్రమాదవశాత్తు జారిపడి ఊపిరాడక చనిపోయాడు. సిద్ధూ అలజడి లేకపోవడంతో తల్లి సుమలత ఇంట్లో పరిశీలించింది. కనిపించకపోవడంతో బయటకు వచ్చి చూడగా అప్పటికే నీటితొట్టిలోపడి ప్రాణాలు వది లి నీటిపై తేలియాడుతూ కనిపించాడు. చుట్టుపక్కల వారి సాయంతో బాలుడిని బయటకు తీశారు.
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సిద్ధు అకస్మాత్తుగా మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా సిద్ధుకంటే పెద్దవాడైన అక్షిత్(6) అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై మల్లేశ్‌యాదవ్ గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగుకు సివిల్ ఆస్పత్రికి తరలించారు. పసిబాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.