గజం గాలిలో 25 కిలోల నీళ్లు..
మనకు నీళ్లు లేనిదే జీవితం గడవదు. భూమ్మీద మూడో వంతు నీళ్లే ఉన్నా.. మనం ఉన్నచోట కరువు ఉంటే మాత్రం బతుకు కష్టమే. ఉన్న నీళ్లలో చాలా వరకు సముద్రాల్లో, కొంతవరకు మంచు రూపంలో ఉన్నాయి. మనకు దిక్కయ్యే నీళ్లు చాలావరకు సరస్సులు, నదులు, ఇతర వనరుల్లోని నీళ్లే. అవీ వాతావరణం నుంచి వాన రూపంలో పడే నీళ్లే. మరి భూమ్మీద వాతావరణంలో మొత్తంగా ఎన్ని నీళ్లు ఉంటాయో, అంతా ఒక్కసారిగా వానలా కురిస్తే ఏమవుతుందో తెలుసా..
ఎక్కువ.. తక్కువ..
భూవాతావరణంలో నీళ్లన్నీ ఆవిరి, అతి సూక్ష్మమైన బిందువుల రూపంలో ఉంటాయి. మొత్తంగా భూమి అంతటా వాతావరణంలో నీళ్లు ఉన్నా.. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, పీడనం, ఇతర వాయువుల శాతం, సమీపంలో జల వనరులు, సముద్రమట్టంతో పోలిస్తే ఎత్తు వంటివాటికి అనుగుణంగా నీటి శాతంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ కారణంగానే ఓ చోట ఎక్కువగా, మరోచోట తక్కువగా వానలు పడతాయి.
- భూమిపైన వాతావరణం వందల కిలోమీటర్ల ఎత్తువరకు ఉన్నా.. నీటి ఆవిరి గరిష్టంగా 16 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే చేరగలుగుతుంది. ఇందులోనే మొత్తంగా 138.6 కోట్ల ఘనపు కిలోమీటర్ల పరిమాణంలో నీళ్లు ఉన్నట్టు అమెరికా జియాలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) అంచనా వేసింది.
- ఒక ఘనపు కిలోమీటర్ నీళ్లు అంటే.. కిలోమీటర్ పొడవు, వెడల్పుతో, కిలోమీటర్ లోతు ఉన్న సరస్సులో పట్టేటన్ని నీళ్లు అనుకోవచ్చు. మరి 138.6 కోట్ల కిలోమీటర్ల నీళ్లు అంటే వామ్మో అనిపిస్తుంది కదా..
భూమి అంతటా 3 సెం.మీ. వాన
మరి వాతావరణంలోని నీళ్లన్నీ ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా వానలా కురిస్తే.. మొత్తం భూమి అంతటా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. 3 సెం.మీ. అంటే తక్కువే అనిపించొచ్చు. కానీ అంతటా వాన అంటే.. అతిభారీ వరదలతో చాలా ప్రాంతాలు మునిగిపోయి, ఊహించలేని నష్టం జరుగుతుందని కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఫాబ్రీ తెలిపారు.
కిలోమీటర్ మేఘం 500 టన్నులు
వాతావరణంలో ఉండే నీటి ఆవిరి ఒకచోట చేరి మేఘాలు గా మారుతుంది. ఆ మేఘాలు చల్లబడి వాన పడుతుంది. మరి గాల్లో తేలిపోతూ ఉండే ఆ మేఘాల బరువెంతో తెలుసా? అమెరికాలోని కొలరా డోలో ఉన్న వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మార్గరెట్ లీమోన్ ఈ లెక్కను శాస్త్రీయంగా తేల్చారు. మేఘాల్లో ని నీటి ఆవిరి బరువు సగటున క్యూబిక్ మీటర్‌కు అర గ్రాము ఉంటుందని గుర్తించారు. ఒక క్యూబిక్ కిలోమీటర్ పరిమాణం ఉండే క్యుములో నింబస్ తరహా మేఘం బరువు ఏకంగా 500 మెట్రిక్ టన్నులుంటుందని తేల్చారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్