నీటిశుద్ధి కేంద్రాలకు మరమ్మతులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా సరైన నీటిసరఫరా లేక నిరుపయోగంగా మూలనపడి ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పునరుద్ధరించేందుకు ఢిల్లీ జల్ బోర్డ్ (డీ జేబీ) నిర్ణయించింది. హరియాణా రాష్ట్రం మరో నెలన్నర రోజుల్లో మునాల్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయనున్నందున అప్పట్లోగా వాటర్ ప్లాంట్ల మరమ్మతులు పూర్తిచేసి పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డీజేబీ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించినట్లు వారు తెలిపారు.
ఈ నీటిశుద్ధి కేంద్రాలు అందుబాటులోకి వస్తే దక్షిణ, నైరుతి,వాయవ్య, పశ్చిమ ఢిల్లీలో నివసించే సుమారు 20 లక్షల మంది పేదలకు మంచినీటిని సరఫరాచేయగలుగుతామని డీజేబీ తెలిపింది. నగరంలో పరిశుద్ధ నీటి సరఫరా విషయమై ఇటీవల డీజేబీని హైకోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. దాంతో ఇరాదత్నగర్లో ఉన్న రావాటర్ పంప్ హౌజ్‌ను మునాక్ కెనాల్‌తో అనుసంధానించే పనిని బోర్డు పూర్తిచేసింది.
ప్రస్తుతం నీటిశుద్ధి కర్మాగారం పనితీరును పరీక్షిస్తున్నారు. పంప్ హౌజ్ నుంచి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ముడినీరు తీసుకువచ్చే లైన్లను పూర్తిచేయడం కోసం బోర్డు తాత్కాలిక అలైన్మెంట్ చేసింది. అమర్‌కాలనీ, భాగ్యవిహార్లలో ఇంకా పూర్తి కాని పనులను ఎలాంటి కూల్చివేతలు జరుపకుండా పోలీసు రక్షణతో నిర్మిస్తున్నారు.
ఈ నీటిలైన్ల కనెక్షన్లు 20 రోజుల్లో పూర్తవుతాయని, నెలరోజుల్లో ద్వారకా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయడం మొదలవుతుందని డీజేబీ తెలిపింది. 40 ఎంజీడీల సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును మూడేళ్ల కింద నిర్మించారు. పదేళ్ల కిందట నిర్మించిన 20 ఎంజీడీల సామర్థ్యం కలిగిన బవానా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ముడినీటి సరఫరా లేకపోవడం వల్ల అది ఇప్పటి వరకు పనిచేయలేదు. ఇన్నాళ్లుగా మూలనపడిన ఈ ప్లాంటులో ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహించి పాతబడిన యంత్రాలను పరీక్షిస్తున్నారు. అవసరమైన మరమ్మతులు చేసి దాన్ని వినియోగించుకోవడానికి డీజేబీ యత్నిస్తోంది.
ఇప్పటికే ఫిల్టరు బెడ్లను, క్లారిఫైయర్లను శుభ్రం చేశారు, ఫిల్టర్ మీడియాను మార్చారు. ఈ ప్లాంటు కూడా మరో 20 రోజుల్లో వినియోగంలోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.అలాగే సగం సామర్థ్యంతో పనిచేస్తున్న ఓఖ్లా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఢిల్లీ జల్‌బోర్డు సిబ్బంది కషిచేస్తున్నారు.