సుజలంపై నీలినీడలు
ఎన్టీఆర్ సుజల స్రవంతిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నిర్ణీత సమయంలో పథకం ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమలు కావాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ప్రక్రియ టెండర్లదశలోనే ఉంది. జిల్లాలో ఎక్కడెక్కడ వాటర్‌ప్లాంట్ యూనిట్లు ఏర్పాటుచేయాలన్నది నేటికీ ఖరారు కాలేదు. కేంద్రాల గుర్తింపు కోసం అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. ప్లాంట్ల ఏర్పాటు తరువాత వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై కూడా ఒకస్పష్టతకు రాలేకపోతున్నారు. ప్రధానంగా ఏజెన్సీలో ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేయాలో గుర్తించలేకపోతున్నారు.
విశాఖ రూరల్ : ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా గ్రామాల్లో రూ.2లకే 20 లీటర్ల రక్షిత నీటిని సరఫరా చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇందుకు సంబంధించి పైసా కూడా విడుదల చేయలేదు. ప్రైవేటు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ద్వారా దీనిని చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమేరకు తాగునీటి ఇబ్బందులు అధికంగా ఉండే గ్రామాలను గుర్తించారు. జిల్లాలో 376 గ్రామాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో
భాగంగా ప్రభుత్వ పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ కొద్ది రోజుల క్రితం సమావేశమయ్యారు. ఒకేసారి 376 గ్రామాల్లో ఏర్పాటు కష్టమని అధికారులే అంటున్నారు. తొలి దశలో 226 గ్రామాల్లో.. : తొలి దశలో 226 గ్రామాల్లో ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణకు 156 పరిశ్రమలు, సంస్థలు ముందుకొచ్చాయి. అయితే ప్రతీ నెలా నిర్వహణ భారం మోసేందుకు మాత్రం కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులు సమకూరుస్తామని, నిర్వహణ బాధ్యతలు వేరెవరికైనా అప్పగించాలని కొందరు అధికారులను కోరినట్లు తెలిసింది. అలాగే యూనిట్ల ధర కూడా ఇష్టానుసారంగా కాకుండా నిర్దుష్టంగా ఉంటే కొనుగోలు సులభమని వారు అధికారులకు సూచించారు.
18న ధరపై నిర్ణయం : నీటి సరఫరా సామర్థ్యం మేరకు యూనిట్ ధర రూ.4.5 నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందరూ ఒక నిర్ణీత ధరకు వీటిని కొనుగోలుకు వీలుగా అధికారులు ఇటీవల ఈ యూనిట్లు సరఫరా చేసే కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 15వ తేదీ వరకు టెండర్లను స్వీకరించారు. ఈ నెల 18న వీటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్లాంట్ల ధరను ఖరారు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చుతో పాటు నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు కొన్ని కంపెనీలు అంగీకరించకపోవడంతో ఆయా చోట్ల నిర్వహణను పంచాయతీలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.
ఏజెన్సీలో పథకం అమలు డౌటే! : తొలి దశలో ఏజెన్సీలో 50 గ్రా మాల్లో ఈ యూనిట్లు ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశించినప్పటికీ కేంద్రాల గుర్తింపు అధికారులకు తలనొప్పిగా మారింది. స్థల సమస్యతో అక్కడి అధికారులు ముందే చేతులెత్తేశారు. కనీసం 10 గ్రామాల్లో అయినా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.