దడ పుట్టిస్తోన్న నీటి ధర!
దండుకుంటున్న వాటర్ ప్యాకెట్ల వ్యాపారులు
తాగునీటి సరఫరా లేక తప్పక కొంటున్న ప్రజలు
యలమంచిలి: ఒకవైపు మండుతున్న ఎండలు... విద్యుత్ కోతలతో తాగునీటి కోసం కటకట! వాటితో ప్రజలు అల్లాడుతుంటే ఇదే అదనుగా ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీలు మాత్రం ధర భారీగా పెంచేశాయి. మరోవైపు రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీరు సక్రమంగా అందకపోవడంతో ఈ వాటర్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు దండిగా లాభాలు దండుకుంటున్నారు.
వాటర్ ప్యాకెట్ ధర రూపాయి నుంచి రూ. 2లకు పెంచేశారు. ఇప్పటివరకు పది రూపాయలకే 10 లీటర్ల నీటి క్యాన్ సరఫరా చేసేవారు. దీన్ని ఇప్పుడు రూ. 20 నుంచి రూ. 30కు అమ్ముతున్నారు. ఎంత ధర పెంచినా అధికారుల నియంత్రణ, పర్యవేక్షణ కొరవడటంతో పలువురు ఈ వ్యాపారం వైపే మొగ్గు చూపిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలతో గ్రామాల్లోనూ నీటి వ్యాపారం భారీ ఎత్తున చేస్తున్నారు.
పలుచోట్ల రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీరు అందకపోవడంతో ప్రజలు ఈ ప్యాకేజ్డ్ నీటిపైనే ఆధారపడక తప్పట్లేదు. విద్యుత్ కోతల కారణంగా తాగునీటి పథకాల నుంచి రోజులో కనీసం రెండు గంటల పాటు కూడా నీరు అందని పరిస్థితి. కొన్నిచోట్ల పైపులైన్ల మరమ్మతుల కారణంగా తాగునీరు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
వీటితో కొంత ఊరట...
పలు ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు సేవా దృక్పథంతో గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు తాగునీటిని సరఫరా చేస్తున్నాయి. యలమంచిలి ఉప్పలపాటి ఫౌండేషన్, బ్రాండిక్స్ పరిశ్రమ యలమంచిలి, పెదపల్లి, పూడిమడక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. నక్కపల్లిలో హెట్రో డ్రగ్స్ పరిశ్రమ యాజమాన్యం ప్లాంట్ను ఏర్పాటుచేసి తాగునీటిని సరఫరా చేస్తోంది. పది లీటర్ల నీటిని రూ. 2ల నుంచి రూ. 5లకే ఇస్తుండటంతో ఇక్కడ డిమాండ్ పెరిగింది.