ఆటుపోట్లతో కరెంటు
ఊహూ... ఫొటోలో ఉన్నది నీటమునిగిన పురాతన నిర్మాణం కానే కాదు. సూపర్ హైటెక్. సముద్రపు అలల్లోని శక్తిని కరెంటుగా మార్చేస్తుంది. చూసేందుకు కొంచెం చిత్రంగా అనిపిస్తున్నా సముద్ర శక్తిని విద్యుత్తుగా మార్చేందుకు ఇదే భేషైన మార్గం అంటున్నారు నెదర్లాండ్స్‌కు చెందిన వాటర్‌స్టూడియో శాస్త్రవేత్తలు. పార్థీనియన్ అని పిలుస్తున్న ఈ సరికొత్త టెక్నాలజీతో ఇంకో ఉపయోగమూ ఉంది. నౌకాశ్రయాల్లో ఆటుపోట్లతో కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తాయి ఇవి.
దీంట్లోని ఒక్కో స్తంభం మూడు అడుగుల వ్యాసముంటుంది. సముద్రపు అలల శక్తికి గిర్రున తిరుగుతుంది. ఈ క్రమంలో పుట్టే శక్తిని.. పార్థీనియన్ పైభాగంలో ఉన్న ప్రత్యేకమైన ఏర్పాటు ద్వారా విద్యుత్తుగా మారుస్తారు. ఆటు.. పోటు రెండింటికీ స్తంభాలు రెండువైపులకూ తిరగగలవు కాబట్టి రోజంతా విద్యుదుత్పత్తి సాధ్యమవుతుందన్నమాట. వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ అవుతున్న ఈ కాలంలో కాలుష్యం లేకుండా విద్యుత్తు ఉత్పత్తి చేయగల ఇలాంటి టెక్నాలజీల అవసరం చాలానే ఉంది.– సాక్షి నాలెడ్జ్ సెంటర్