ఏసీబీ వలలో ఏఈ
కడప అర్బన్, న్యూస్‌లైన్ : అవినీతి శాఖ అధికారుల వలలో మరో చేప చిక్కింది. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ రాజారావు నేతృత్వంలో రూరల్ వాటర్ సప్లయ్ స్కీమ్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న టి.విజయకుమార్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. చింతకొమ్మదిన్నె మండలం రసూల్పల్లెకు చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాసుల రెడ్డి రూరల్ వాటర్ సప్లయ్ స్కీమ్ కింద రూ. 1.20 లక్షల విలువైన పనులు చేశాడు . బిల్లు మంజూరు కోసం ఎంబుక్‌ను కూడా తయారు చేశారు. రూ. 5 వేలు ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని ఏఈ విజయకుమార్ మెలిక పెట్టాడు. దీంతో శ్రీనివాసులురెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ఏఈ విజయకుమార్‌కు శ్రీనివాసులరెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు లంచం ఇస్తుండగా డీఎస్పీ రాజారావు ఆధ్వర్యంలో అవినీతి శాఖ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వివరాలను డీఎస్పీ మీడియాకు తెలియజేశారు. దాడి చేసిన వారిలో డీఎస్పీతోపాటు సీఐలు పార్థసారథిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామకిశోర్రెడ్డి ఉన్నారు. ఏఈ విజయకుమార్‌పై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.