నేడు సాగర్ నుంచి నీటి విడుదల
ఎగువ ప్రాంతంలో వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా నిండిపోగా, నాగార్జునసాగర్ కూడా బుధవారం నాటికి నిండిపోనుంది. దీంతో పైనుంచి వస్తున్న భారీ వరద నీటిని కిందకు వదిలివేయనున్నారు. బుధవారం నుంచి దశలవారీగా నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారని అధికారులు చెబుతున్నారు. దానిని దశలవారీగా పెంచే అవకాశముందని పేర్కొంటున్నారు. భారీగా వరద వస్తుందని తెలిసినా ప్రభుత్వం ఇప్పటివరకు కృష్ణాడెల్టాకు నీరివ్వడానికి ముందుకు రాలేదు.
దీంతో జిల్లాలో పలుచోట్ల వేసిన నారు ఎండిపోయి, పొలాలు నైచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా నీటిని విడుదల చేయనుండటంతో ఆ నీరు మొత్తం సముద్రంలోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుతం బ్యారేజీకి పదివేల క్యూసెక్కులు మాత్రమే వస్తుండటంతో ఏడువేలు తూర్పు డెల్టాకు, మూడు వేల క్యూసెక్కులు పశ్చిమ డెల్టాకు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం విడుదల చేసే వరద నీరు గురువారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి చేరుకునే అవకాశముంది. దిగువకు 3.30 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి ప్రజలను కోరారు.
పస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 580.4 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం స్థాయి 590 అడుగులు కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు 3,76,608 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో 3,51,826 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 2,50,793 వస్తోంది. సాగర్ కుడి, ఎడమ కాల్వలతో పాటు దిగువకు 27,237 క్యూసెక్కుల నీటిని వదలనున్నారు. సాగర్‌కు ఇంకా 30 టీఎంసీల నీరు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుంది. ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లోను బట్టి సాగర్ ఒక్కరోజులో నిండిపోతుంది. దీంతో నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయించారు.