‘మరుగు’లో మెరుగయ్యేదెన్నడు?
రాయ్‌చూర్‌కు చెందిన 25 ఏళ్ల మహేశ్వరి అన్న ఈ మాటలు దేశంలో సామాన్యుల ‘టాయిలెట్’కష్టాలకు అద్దం పడుతున్నాయి! స్వచ్ఛభారత్ అభియాన్ పేరిట కేంద్రం కోట్లు వెచ్చించి మరుగుదొడ్లను నిర్మిస్తున్నా పరిస్థితి తీసికట్టుగానే ఉంది. ఐదు.. పది కోట్లు కాదు.. మన దేశంలో ఏకంగా 73.22 కోట్ల మందికి మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అంటే 130 కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో సగానికిపైగా (56 శాతం) ప్రజలు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక మంది మరుగుదొడ్లకు దూరంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉన్నట్టు వాటర్ ఎయిడ్ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ నెల 19న ‘వరల్డ్ టాయిలెట్ డే’ సందర్భంగా ‘ఔట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ టాయ్‌లెట్స్–2017’ పేరిట మూడో వార్షిక నివేదికను వెలువరించింది.
ఈ జాబితాలో భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 34.35 కోట్ల మంది(జనాభాలో 25%)కి టాయిలెట్ సౌకర్యం లేదని నివేదిక తెలిపింది. తర్వాతి స్థానాల్లో వరుసగా నైజీరియా(12.28 కోట్లు– దేశ జనాభాలో 67%), ఇథియోఫియా(9.24 కోట్లు– జనాభాలో 93%), బంగ్లాదేశ్(8.55 కోట్లు– జనాభాలో 85.5%) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులో లేదని నివేదిక తెలిపింది. అలాగే మరుగుదొడ్లు లేక ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది మహిళలు, అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చదువుకు సైతం దూరమవుతున్నారని, అనారోగ్య సమస్యలు, వేధింపులు, దాడుల బారిన పడుతున్నారని పేర్కొంది.
మా ఇంట్లో టాయిలెట్ లేదు. గర్భిణిగా ఉన్న సమయంలో మరుగుదొడ్డికి వెళ్లాలంటే ఎంతో కష్టంగా ఉండేది. ఆరుబయటకు వెళ్లాల్సిందే. ఆ దారేమో అంత సురక్షితం కాదు. నిలబడాలన్నా, కూర్చోవాలన్నా సాయం కావాలి కదా.. అందుకే వెంట మా అత్తమ్మను తోడుగా తీసుకెళ్లేదాన్ని..
మార్పు వస్తోంది.. కానీ..
దేశంలో పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014 అక్టోబర్‌లో స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రారంభించింది. దీనిద్వారా దేశంలో 39 శాతంగా ఉన్న ‘పారిశుధ్య కవరేజీ’ని 65 శాతానికి చేర్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. గ్రామీణ భారతంలో గత మూడేళ్లలో 5.2 కోట్ల మరుగు దొడ్లను నిర్మించినట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినట్టు వాటర్ ఎయిడ్ సంస్థ కూడా ధ్రువీకరించింది. పారిశుధ్యంపై ప్రచారంతో బహిరంగ మల విసర్జన 40 శాతం మేర తగ్గిందని, కొత్తగా 10 కోట్ల మందికిపైగా టాయిలెట్లు వినియోగిస్తున్నారని వివరించింది. కనీస పారిశుధ్య సౌకర్యానికి నోచుకోని ప్రజలు 2000లో 78.3 శాతం ఉంటే 2015 కల్లా 56 శాతానికి తగ్గారని తెలిపింది. అలాగే బహిరంగ మల విసర్జనను నిర్మూలించి, పారిశుధ్య సౌకర్యాలు పెంచేందుకు కృషి చేస్తున్న ప్రపంచంలోని తొలి పది దేశాల్లో భారత్ ఆరో స్థానంలో ఉన్నట్టు పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015–16 వివరాల ప్రకారం... తెలంగాణలో మొత్తం 50.2 శాతం (పట్టణ ప్రాంతాల్లో 64.4%, గ్రామీణ ప్రాంతాల్లో 38.9%) కుటుంబాలకు మెరుగైన
పారిశుధ్య వసతి ఉంది. ఏపీలో 53.6% కుటుంబాలకు (పట్టణ ప్రాంతాల్లో 77.4 %, గ్రామీణ ప్రాంతాల్లో 43.1 % ) మెరుగైన పారిశుధ్య వసతి ఉంది
నివేదికలో మరిన్ని అంశాలు
- భారత్‌లో టాయిలెట్ సౌకర్యానికి నోచుకోలేని 35.50 కోట్ల మంది మహిళలు, ఆడపిల్లలను వరుసగా నిలబెడితే.. ఆ వరుస భూమిని నాలుగు సార్లు చుట్టి వచ్చేంతగా ఉంటుంది!
- అపరిశుభ్రత వల్ల డయేరియా ప్రబలి దేశంలో ఏటా 60,700 మంది చిన్నారులు మరణిస్తున్నారు. వీరిలో తొలి ఐదేళ్లలో చనిపోతున్నవారే ఎక్కువ.
- 2015 నాటికి ప్రతిరోజు 321 మంది పిల్లలు డయేరియాతో మృతి చెందుతున్నారు
- బహిరంగ మల విసర్జన కారణంగా కొంకిపురుగుల ఇన్ఫెక్షన్తో డయేరియా వ్యాప్తి చెందుతోంది. దీనివల్ల మహిళలు రక్తహీనత, బరువు తగ్గిపోవడం వంటి అనారోగ్యాల బారిన పడుతున్నారు
- ఐదేళ్ల వయసు చిన్నారుల్లో 38% మంది ఎత్తుకు తగ్గ బరువు ఉండటం లేదు. (2015–16 జాతీయ కుటుంబ, ఆరోగ్య లెక్కలు)
- నెలసరి సమస్య వల్ల భారత్‌లో 23 శాతం మంది అమ్మాయిలు స్కూళ్లకు వెళ్లకుండా డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. స్కూళ్లలో తమకు ఎలాంటి పారిశుధ్య వసతులు ఉండటం లేదని వారిలో 28% మంది తెలిపారు. (ఇండియాస్పెండ్ నివేదిక)
- అపరిశుభ్రత వల్ల వ్యాధులు ప్రబలి ప్రపంచంలో ఏటా 2,89,000 మంది ఐదేళ్ల లోపు పిల్లలు చనిపోతున్నారు. రోజుకు 800 మంది, ప్రతి రెండు నిమిషాలకు ఒకరు చొప్పున మరణిస్తున్నారు.
- మంచినీరు, టాయ్లెట్ల కోసం ఖర్చు చేసే ప్రతి డాలర్‌కు సగటున 4 డాలర్ల చొప్పున ఉత్పాదకతను పెంచవచ్చు
– సాక్షి నాలెడ్జ్ సెంటర్, తెలంగాణ డెస్క్