ఎదుగుదల లోపం..భారత్‌లోనే అధికం!
న్యూఢిల్లీ: ఎదుగుదల లోపంతో బాధపడే పిల్లల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని మంగళవారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడైంది. దేశంలో ఏకంగా 4 కోట్ల 80 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. దీని బట్టి ప్రతీ ఐదుగురు చిన్నారుల్లో ఇద్దరు ఈ లోపంతో ఉన్నారని తేలింది.
అంతర్జాతీయ అభివృద్ధి చారిటీ సంస్థ ‘వాటర్ ఎయిడ్’ ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 కోట్లకుపైగా చిన్నారులు ఈ సమస్యతో బాధపడుతున్నారిని సర్వే పేర్కొంది. భారత్‌లో అత్యధిక ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారని, ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితులే...పిల్లల ఎదుగుదల, తక్కువ బరువు సమస్యల కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని సంస్థ పేర్కొంది. భారత్ తర్వాత వరుసగా నైజీరియా, పాకిస్తాన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఆరున్నర కోట్ల మందికి కనీసం తాగడానికి మంచి నీరు దొరికే పరిస్థితులు లేవని, అదేవిధంగా రెండు కోట్లకుపైగా జనాలకు సరైన మరుగుదొడ్డి సదుపాయాలు లేవని నివేదికలో వెల్లడైంది. అపరిశుభ్రత కారణంగా ప్రతిఏడాది సుమారు 3 లక్షలకుపైగా చిన్నారులు మృత్యువాత పడుతున్నారని సర్వే తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రతీ దేశం కృషిచేయాలని ఇటీవలే ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో తీర్మానించాయి.