
ప్రణయ్ పరాజయం
మాళవిక ముందంజ
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
బర్మింగ్‌హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తొలి రౌండ్‌లో లక్ష్యసేన్, మాళవిక బన్సోద్ విజయాలు సాధించి ముందంజ వేయగా... హెచ్‌ఎస్ ప్రణయ్ పరాజయంతో ఇంటిబాట పట్టాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మంగళవారం ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్యసేన్ 13–21, 21–17, 21–15తో ప్రపంచ 37వ ర్యాంకర్ లి యాంగ్ సు (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు.
గంటా 15 నిమిషాల పాటు సాగిన పోరు తొలి గేమ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లక్ష్య... హోరాహోరీగా సాగిన రెండో గేమ్ 17–17తో సమంగా ఉన్న సమయంలో చైనీస్ తైపీ షట్లర్ తప్పిదాలతో వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన లక్ష్యసేన్... నెట్ గేమ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసి 11–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పట్టువదలని చైనీస్ తైపీ షట్లర్ 15–15తో స్కోరు సమం చేశాడు.
అక్కడి నుంచి విజృంభించిన లక్ష్యసేన్... బలమైన రిటర్న్‌లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టి (ఇండోనేసియా)తో లక్ష్యసేన్ తలపడతాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో క్రిస్టి చేతిలో ఓడిన లక్ష్యసేన్... ఆ పరాజయానికి బదులు తీర్చుకునేందుకు ఇది చక్కటి అవకాశం.
మరో మ్యాచ్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 16–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 53 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రణయ్ వరుస గేమ్‌ల్లో ఓడాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–13, 10–21, 21–17తో జియా మిన్ యో (సింగపూర్)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 20–22, 18–21తో చెన్ చెంగ్–సెయి పెయి షాన్ జంట చేతిలో ఓడింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య జంట 6–21, 15–21తో జిన్ వా–చెన్ ఫెంగ్ హుయి (చైనా) ద్వయం చేతిలో ఓడింది. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి బుధవారం బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో యున్ కిమ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో డానియల్ లిండ్‌గార్డ్–మాడ్స్ వెస్టర్‌గాడ్ (డెన్మార్క్) జంటతో సాత్విక్–చిరాగ్ జోడీ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment