ప్రధాని మోదీపై మమతా ఘాటైన వ్యాఖ్యలు
రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ అరెస్టుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రధాని మోదీ అరెస్టు చేయాలనుకుంటే తనతో పాటు, తమ ఎంపీలు, ఎమ్మెల్యేలందర్ని అరెస్టు చేసుకోండని, కానీ పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా తాము చేపట్టే నిరసనను మాత్రం వదిలేది లేదని పట్టుబిగించారు. సాధారణ ప్రజల కోసం తమ నిరసన కచ్చితంగా కొనసాగిస్తామన్నారు. రాజకీయ కుట్ర కొత్త అవతారమెత్తిందని, తమ ఎంపిలందరిన్నీ ప్రధాని అరెస్టు చేపించినా తాను ఆశ్చర్యపోనని చెప్పారు..
పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు బ్లాక్‌మనీని వెనక్కి తీసుకొస్తానని మోదీ చేసిన వాగ్దానం మంటగలిసిపోయిందని విమర్శించారు. బ్లాక్‌మనీ డిపాజిట్ కాకపోగా, కనీసం ప్రభుత్వం వాటిని గుర్తించను కూడా గుర్తించలేదున్నారు. సాధారణ ప్రజానీకం దగ్గర అసలు ఆ నోట్లే లేవన్నారు. మోదీ తీసుకున్న ఈ చర్యతో మొదటిసారి ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోయిందని, ఆర్బీఐ పైనా విశ్వసనీయత కోల్పోయారని చెప్పారు. అంబేద్కర్ పేరుమీద నేడు ప్రధాని లాంచ్ చేసిన భీమ్ యాప్‌పైనా మమతా మండిపడ్డారు. అంబేద్కర్ పేరుపై ఈ లాటరీ యాప్‌ను ఆవిష్కరించడం, మోదీ క్రూర మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. బలహీన ప్రజలను ఇది అవమాన పరుస్తోందని విమర్శించారు.