పోలీసు ఆయుధాల ప్రదర్శన
విజయవాడ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం బందరురోడ్డులోని ఏఆర్ గ్రౌండ్స్‌లో ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. పోలీసులకు సంబంధించిన ఆయుధాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వినియోగించే పరికరాలను ప్రదర్శించారు. పోలీసు జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నిందితులను పోలీసు జాగిలాలు పసిగట్టే విధానాన్ని విద్యార్థులకు నిపుణులు వివరించారు. పోలీసులు వినియోగించే రకరకాల తుపాకులను ప్రదర్శించారు. వాటిని వినియోగించే పద్ధతులను కూడా వివరించారు. బాంబ్ డిస్పోజల్ పద్ధతులలో వినియోగించే ఆధునిక సామగ్రి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ గురించి తెలియజేశారు. డీసీపీ(అడ్మిన్) జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ పోలీసుల సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ పాఠశాలలకు చెందిన 500 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారు.